నిజాయతీ చాటుకున్న ఆటోడ్రైవర్
రామగుండం : పట్టణానికి చెందిన బొడ్డుపల్లి చందు అనే ఆటోడ్రైవర్ విధి నిర్వహణలో ఆదివారం గోదావరిఖని నుంచి రామగుండంకు ఆటోలో ప్యాసింజర్లను తీసుకువస్తున్నాడు. ఎఫ్‌సీఐ ఎక్స్‌రోడ్ వద్ద రోడ్డుపై పర్సు పడి ఉండడంతో ఆటో నిలిపి పర్సును తీసుకున్నాడు. అందులో ఉన్న గుర్తింపు ఆధారంగా జెన్కో సివిల్ కాంట్రాక్టర్ రంగుల ప్రశాంత్ పర్సుగా గుర్తించి సమాచారమందించాడు. దీంతో సదరు బాధితుడు మజీద్ కార్నర్ వద్దకు రాగా అందరి సమక్షంలో పర్సును ప్రశాంత్‌కు అందజేశాడు. అందులో గుర్తింపు కార్డుతో పాటు రూ.4,610 నగదు, చెక్కులు, ఏటీఎం కార్డు, పాన్‌కార్డు, ఆధార్ కార్డుతోపాటు కీలక రశీదులు ఉన్నాయి. నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్ చందును ప్రశాంత్‌తోపాటు జెన్కో ఉద్యోగులు అబ్దుల్ తఖీ, ఆడెపు శ్రీనివాస్, నూనె రాజేందర్ అభినందించారు.