పుష్కరాలకు 5 కోట్ల మంది
ద్వారకా తిరుమల (పశ్చిమగోదావరి) : గోదావరి పుష్కరాలకు 5 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. ద్వారకాతిరుమలలో సోమవారం పుష్కర శోభాయాత్రను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కుంభమేళా తరహాలో పుష్కరాలు నిర్వహిస్తున్నామన్నారు.
దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ.. పుష్కరాల సందర్భంగా ప్రారంభించిన శోభాయాత్ర ఈ నెల 16 ఉదయానికి రాజమండ్రి కోటిలింగాల రేవుకు చేరుతుందన్నారు. అలాగే మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ.. వివిధ జిల్లాల నుంచి వచ్చిన శోభాయాత్రికులు వారి వారి ప్రాంతాల నుంచి నదీ జలాలను తీసుకువచ్చి రాజమండ్రి పుష్కర ఘాట్లో నిమజ్జనం చేస్తారని, తిరిగి గోదావరి జలాలను తమ ప్రాంతాలకు తీసుకు వెళ్లి దేవాలయాల్లో అభిషేకాలకు వినియోగిస్తారన్నారు.