పరిపూర్ణ వ్యక్తి పద్మశ్రీ పుట్టపర్తి నారాయణచార్యులు
సాక్షి, హైదరాబాద్: పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు పరిపూర్ణమైన వ్యక్తిత్వంగల మహనీయుడని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. గురువారం రాత్రి రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాహితీ మూర్తిత్రయ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు డాక్టర్ పుట్టపర్తి నారాయణచార్యులు శతజయంతి మహోత్సవ వేడుకలు జరిగాయి. రవీంధ్రభారతీ ప్రధాన వేదికపై ఈ వేడుకల్లో డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు పురస్కారాన్ని ప్రముఖ అవధాని డాక్టర్ మేడసాని మోహన్‌కు బహూకరించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడి ్డ అధ్యక్షతన జరిగిన వేడుక లకు జస్టిస్ బి.చంద్రకుమార్ ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. డాక్టర్ పుట్టపర్తి నారాయణచార్యులు గొప్ప కవి, పండితుడు, సాత్వికుడే కాకుండా చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త అని కీర్తించారు.
ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ భౌగోళికంగా రాష్ట్రం రెండుగా విడిపోయినా.. సాహితీ పరంగా కలిసే వుంటాయని పేర్కొన్నారు. పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన పద్య, గేయ కావ్యాల్లోని రచనలను క్రోడీకరించిన వెయ్యి పేజీల సంపుటాన్ని ముద్రిస్తామని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ చెప్పారు. నారాయణాచార్యుల కాంస్య విగ్రహాన్ని కడప నగరంలో ప్రతిష్టిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చారిత్రక నవలాచక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్, అక్కినేని నాటక కళాపరిషత్ అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు, పుట్టపర్తి కుమార్తె డాక్టర్ నాగపద్మిని, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం తదితరులు పాల్గొన్నారు. అంతుకుముందు డాక్టర్ అనుపమ కైలాష్ ప్రదర్శించిన శివతాండవం కూచిపూడి నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది.