29న బ్యాంకు అధికారుల సమ్మె
న్యూఢిల్లీ: ధన్లక్ష్మి బ్యాంక్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ పీవీ మోహనన్ తొలగింపునకు నిరసనగా ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారుల సంఘంలోని ఒక వర్గం ఈ నెల 29న సమ్మెకు పిలుపునిచ్చింది. అదే రోజున కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య (ఏఐబీవోసీ) కేరళ రాష్ట్ర విభాగానికి మోహనన్ ప్రెసిడెంటుగా కూడా ఉన్నారు. అమానుషమైన చట్టాన్ని ప్రయోగించి మోహనన్ను ధన్లక్ష్మీ బ్యాంకు విధుల నుంచి తొలగించిందని ఏఐబీవోసీ జనరల్ సెక్రటరీ హర్విందర్ సింగ్ పేర్కొన్నారు. దీనిపై యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో 29న ఒక రోజు సమ్మె జరపాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. తమ అసోసియేషన్లో 2.75 లక్షల మంది పైచిలుకు ఆఫీసర్లు సభ్యులుగా ఉన్నారని సింగ్ చెప్పారు. ఆంధ్రా బ్యాంక్, బీఓబీ తదితర బ్యాంకులు ఇప్పటికే సమ్మె పిలుపు గురించి ఖాతాదారులకు తెలియజేశాయి. సమ్మె జరిగితే ఖాతాదారులకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది.