ఫార్మా ఎగుమతులు.. మూడేళ్లలో 25 బిలియన్ డాలర్లకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫార్మా ఎగుమతులు వేగంగా వృద్ధి చెందుతున్నాయని, వచ్చే మూడేళ్లలో వీటి విలువ 25 బిలియన్ డాలర్లు దాటుతుందని ఫార్మెక్సిల్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం 15 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫార్మా ఎగుమతులు ఏటా 20 శాతం చొప్పున వృద్ధి చెంది 25 బిలియన్ డాలర్లు దాటతాయని ఫార్మెక్సిల్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ పి.వి.అప్పాజీ తెలిపారు.
ఫార్మెక్సిల్ 10వ వార్షిక సర్వసభ్య సమావేశ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మొత్తం ఎగుమతుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 30 శాతంగా ఉందన్నారు. ఇందులో తెలంగాణా రాష్ట్రానికి 65 శాతం, ఆంధ్రప్రదేశ్‌కి 35 శాతం వాటా ఉండొచ్చన్నారు. దేశ ఫార్మా ఎగుమతుల్లో ఆయుర్వేద ఎగుమతుల వాటా 5 శాతం వరకు ఉందన్నారు.
పదేళ్ల క్రితం రూ.17,000 కోట్లుగా ఉన్న ఫార్మా ఎగుమతులు ఈ ఏడాది తొలిసారిగా లక్ష కోట్ల మార్కును అధిగమిస్తోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఫార్మెక్సిల్ చైర్మన్ అశితోష్ గుప్తా మాట్లాడుతూ నైజీరియాలో ఉన్న ఎగుమతుల అవకాశాలను అందిపుచ్చుకునేలా ఒక మార్కెటింగ్ స్కీంను ప్రవేశపెడుతున్నామని, కాని ఇది ఎబోలో వ్యాధి కారణం గా 2015కి వాయిదాపడిందన్నారు. ఈ పథకం కింద ఫార్మెక్సిల్ గిడ్డంగులను నిర్మించి చిన్న కంపెనీలకు తక్కువ అద్దెకు ఇస్తుందన్నారు. తొలి ఏడాది 75%, రెండో ఏడాది 50%, మూడో ఏడాది 33% రెంటల్ సబ్సిడీ అందించనున్నట్లు తెలిపారు.