ముత్యాలమ్మ జాతరపై నీలినీడలు
27న నిర్వహించాల్సి ఉన్నా కానరాని ఏర్పాట్లు
ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి
వెనకడుగు వేస్తున్న ఉత్సవ కమిటీ నాయకులు
చింతపల్లి, న్యూస్‌లైన్: ముత్యాలమ్మ జాతర నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ జాతర మాజీ మంత్రి బాలరాజు ప్రతిష్టకు పరీక్షగా మారడంతో ఆనవాయితీ ప్రకారం ఈ నెల 27 నుంచి 29 వరకు ఉత్సవాలు జరుపుతామని ప్రకటించారు. ఇంత వరకు ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది.
బాలరాజు సారథ్యంలో జాతర జరిపేం దుకు ఉత్సవ కమిటీ, వర్తక, ఉద్యోగ సంఘాల నాయకులు వెనుకడుగు వేస్తున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తితే తామెక్కడ మునిగిపోతామోనని ఎవరికి వారే జంకుతున్నారు. బాలరాజు మం త్రిగా ఉన్న నాలుగేళ్లూ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతర పది రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసేవారు. ఈ జాతర కోసం రూ.15 లక్షల వరకు ఖర్చు చేసేవారు.
జాతరలో అన్ని శాఖల అధికారులు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి పండుగ విజయవంతం చేయడంలో ముఖ్య భూమిక పోషించేవారు. ప్రస్తుతం బాలరాజు మాజీ మంత్రి కావడంతో అధికారుల సహకారం అందే అవకాశం లేదు. నిర్వహణ పనుల్లో కూడా వారు పాల్గొనే అవకాశం లేకపోవడంతో జాతర జరుగుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆనవాయితీ ప్రకారం 27 నుంచి 29 వరకు జాతర జరపాలని ఉద్యోగ సంఘాలు, ఉత్సవ కమిటీ నిర్ణయించాయి.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యం లో జాతర వాయిదా వేయాలని బాలరాజు సతీమణి రాధ నిర్ణయించారు. వాయిదాపై విమర్శలు రేగడంతోపాటు వైఎస్సార్సీపీ నాయకులు పండుగ చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో తన ప్రతిష్టకు ఎక్కడ భంగం కలుగుతుందోననే ఆందోళనలో ఉత్సవాలను యథావిధిగా జరుపుతామని మాజీ మంత్రి బాలరాజు ఈ నెల 19న చింతపల్లిలో ప్రకటించారు. ఇంత వరకు ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టడం లేదు. బాలరాజు కూడా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా తిరుగుతున్నారు. దీంతో ఉత్సవాలు జరుగుతాయో లేదో అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.