ఎన్నికల తర్వాత ప్యాకప్: కవిత
హైదరాబాద్: ఎన్నికల ముందు పార్టీ పేరుతో వచ్చిన పవన్‌కల్యాణ్.. ఎన్నికలు కాగానే ప్యాకప్ చేసుకుని వెళ్లిపోతాడని తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. వివిధ జిల్లాలకు చెందిన యువజన సంఘాల నేతలు జాగతిలో చేరిన సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడారు. పరిమిత లక్ష్యాలతో, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే అలాంటి పార్టీలు పుడతాయని కవిత విమర్శించారు.
గత ఎన్నికల్లో అన్న చిరంజీవి ఒక పార్టీని పెట్టి ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్‌లో కలిపేశాడన్నారు. తమ్ముడు ఈ ఎన్నికల్లో పార్టీని పెట్టి ఒకవైపు గద్దర్‌ను, మరోవైపు నరేంద్ర మోడీని పెట్టుకోవడం ఎలా సమంజసమని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు పవన్ కల్యాణ్ అవగాహన రాహిత్యానికి నిదర్శమని విమర్శించారు. సీరియస్ సినిమాలో కమెడియన్‌లాగా రాజకీయాల్లోకి పవన్‌కల్యాణ్ రంగప్రవేశం చేశాడని ఎద్దేవా చేశారు. ఇలాంటి సమైక్యవాదులు ఏదో ఒక ముసుగులో తెలంగాణలోకి ప్రవేశించాలని అనుకుంటున్నారని, టీడీపీకి, బీజేపీకి వారధిగా పవన్ కల్యాణ్ పనిచేస్తున్నాడని పేర్కొన్నారు.