Pyapili
-
కర్నూల్ ప్యాపిలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
కర్నూలు: జిల్లాలోని ప్యాపిలి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్యాపిలీ గ్రామానికి సమీపంలో కారు టైర్ పేలడంతో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మృతులంతా ఆత్మకూరు వాసులుగా గుర్తించారు. కాగా మృతుల్లో ఆత్మకూరు సాక్షి టీవీ రిపోర్టర్ సుధాకర్గౌడ్ ఉన్నట్లు సమాచారం. -
మరదలిపై వ్యామోహంతో భార్యను..
సాక్షి, కర్నూలు: తోడూనీడగా ఉండాల్సిన భర్తే.. అర్ధాంగి ఆయువు తీశాడు. మరదలిపై మోజు పెంచుకొని భార్యను కిరాతకంగా కడతేర్చాడు. ఈ దారుణం అలేబాదు తండాలో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల మండలం గోరుమాను కొండ తండాకు చెందిన సుశీలబాయికి రెండేళ్ల క్రితం అలేబాదు తండాకు చెందిన రవినాయక్తో వివాహమైంది. వారికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. కొద్దిరోజుల నుంచి సుశీలబాయి చెల్లిని వివాహం చేసుకొంటానని రవినాయక్ చెప్పేవాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం నడిచేది. భార్యను అంతమొందించాలని పథకం ప్రకారం.. ఆదివారం తనతో పాటు జీవాలు మేపేందుకు కొండకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను బండరాళ్లతో మోది చంపేసి మృతదేహాన్ని లోయలోకి తోశాడు. ఏమీ ఎరుగనట్లు ఇంటికి వచ్చి తన భార్య కనబడడంలేదని గ్రామస్తులకు చెప్పాడు. భార్య తల్లిదండ్రులకు ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్పడంతో ఆందోళనకు గురై రాత్రికి రాత్రే గ్రామానికి చేరుకొని కుమార్తె కోసం గాలించారు. సుశీల బాయి మృతదేహం గ్రామ శివార్లలోని లోయలో పడి ఉండడాన్ని సోమవారం ఉదయం గమనించిన పశువుల కాపరులు విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. విషయం వెలుగులోకి రావడంతో నిందితుడు రవినాయక్ పరారయ్యాడు. హతురాలి తండ్రి సేవ్యా నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాచర్ల ఎస్ఐ నరేష్ తెలిపారు. చదవండి: పెళ్లి చేసుకోమంటే.. నగ్న ఫోటోలతో బయపెడుతూ.. -
53 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక
సాక్షి, ప్యాపిలి: కర్నూలు జిల్లా ప్యాపిలి బాలుర ఉన్నత పాఠశాలలో 1966–67 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. ఏడు పదుల వయసుకు దగ్గర పడిన వారంతా ఎంతో ఉత్సాహంగా ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. దాదాపు 50 మంది పూర్వ విద్యార్థులు హాజరుకావడంతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుత హెచ్ఎం చంద్రలీలమ్మ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఆనాటి ఉపాధ్యాయులు బాలసంజీవయ్య, రాణిరెడ్డి, హనీఫ్, ప్రసాద్, శివరామిరెడ్డి, ప్రసాద్, మహమ్మద్ సాహెబ్, శ్రీరాంశెట్టి, రమణ తదితరులను ఘనంగా సన్మానించారు. పాఠశాలకు రూ.24 వేల విలువైన బీరువాలను అందజేశారు. 53 ఏళ్ల తర్వాత తామంతా ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖలో ఏఎస్ఓగా పనిచేసి, రిటైర్ అయిన రాముడు అన్నారు. ఇలాంటి సందర్భాలు జీవితంలో అరుదుగా వస్తాయని మహబూబ్ సాహెబ్ అన్నారు. (చదవండి: విమానం దిగింది.. ఎగిరింది..! ) -
ఏడవరా కన్నా..!
చిన్నపిల్లలు ఏడిస్తే.. ఏడవద్దురా కన్నా నీకు తాయిలాలు పెడతా అని మురిపించి ఏడుపును మరిపించడం అందరికీ తెలిసిందే. అయితే కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన ఓ పిల్లాడు మాత్రం పుట్టినప్పటి నుంచి ఏడవకపోవడం తల్లిదండ్రులను కలచివేస్తోంది. స్థానిక శ్రీరామ థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న రమేష్, లక్ష్మీదేవి దంపతులకు ఇరువురు సంతానం. పెద్ద కుమారుడు అరవింద్(7) పుట్టినప్పటి నుంచి ఏడవకపోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. వైద్యులు పరీక్షించి ఎలాంటి అనారోగ్య సమస్య లేదని చెబుతున్నా.. వారి మనసు కుదుటపడటం లేదు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్న ఈ పిల్లాడు.. కొట్టినా, తిట్టినా, గిచ్చినా కంట్లో నీటి చుక్క రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెండో కుమారుడు అఖిల్(5) మాత్రం అందరిలానే ఏడుస్తుండటంతో పెద్ద కుమారుని విషయంలో తల్లిదండ్రులు బెంగ పెట్టుకున్నారు. సాధారణంగా పిల్లల కంట్లో కన్నీరు వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు.. కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం కుమారుడు ఏడిచే రోజు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై స్థానిక వైద్యాధికారి చెన్నకేశవులును వివరణ కోరగా బాలుడికి స్వరపేటికలో సమస్య ఉండొచ్చని తెలిపారు. -ప్యాపిలి