అంచనాలను అధిగమించిన ఇన్ఫీ
ముంబై: అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఎనలిస్టులు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మార్కెట్ అంచనాలకు మించి ఆశ్చర్యకర ఫలితాలను వెల్లడించింది. 6.1 శాతం వృద్ధితో రూ. 3606 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని, 10 శాతం వృద్ధితో రూ.18,070 కోట్ల ఆదాయాన్ని సాధించింది. రూ. 17310 కోట్ల ఆదాయంపై ఈ నికర లాభాన్ని ఆర్జించింది. ఎబిటా రూ.4309 కోట్లుగా నమోదు చేసింది. 2,587 మిలియన్ డాలర్ల డాలర్ ఆదాయాన్ని ఆర్జించింది. ఒక్కో షేరుకు రూ. 11 మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు బోర్డ్ అంగీకరించినట్టు కూడా సంస్థ ప్రకటించింది. దీంతోపాటుగా కంపెనీ కరెన్సీ పరంగా 8-9 శాతం రెవెన్యూ గైడెన్స్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కంపెనీ నిర్వహణా లాభాలు 80 బేసిస్ పాయింట్లు వరుసగా పెరిగి 4.9 శాతం విస్తరించాయి.
ఆర్థిక సంవత్సరం మొదటి అర్థ భాగం, సమీపంలో అనిశ్చిత వ్యాపార దృక్పథ తీరును గమనించిన తరువాత గైడెన్స్ ను తగ్గించేందుకు నిర్ణయించామని ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా వ్యాఖ్యానించారు. గత ఏడాది 10.5-12 శాతం ఆదాయ అంచనా కంటే ఇది తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం గైడెన్స్ లో కోత పెట్టడం రెండవ సారి.
మరోవైపు ఇన్ఫీ ఆర్థిక ఫలితాల అనంతరం ఒక్కసారిగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో మార్కెట్ ఆరంభంలో 3 శాతం వరకూ లాభపడిన ఇన్ఫోసిస్ కౌంటర్లో అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో ఒక దశలోసుమారు 5 శాతం పతనమైంది. బీఎస్ఈలో ఇన్ఫోసిస్ షేర్ 2.27 శాతం నష్టంతో రూ 1,028.20 వద్ద ట్రేడ్ అవుతోంది.