ఇండియాలో టాప్ యూనివర్సిటీ ఏదో తెలుసా?
న్యూఢిల్లీ: బ్రెజిల్, చైనా, ఇండియా, రష్యా, దక్షిణ ఆఫ్రికా (బ్రిక్స్) దేశాలకు చెందిన యూనివర్సిటీల నాణ్యత ప్రమాణాలను అనుసరించి ర్యాంకులను ప్రకటించే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ 2016 విద్యాసంవత్సరానికి బుధవారం ర్యాంకులను ప్రకటించింది. భారత్ నుంచి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు (ఐఐఎస్సీ-బీ) అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 250 యూనివర్సిటీలకు క్యూఎస్ ర్యాంకులు ప్రకటించగా 44 భారతీయ యూనివర్సిటీలు ర్యాంకింగ్స్ లో స్థానం సంపాదించాయి. ఓవరాల్ ర్యాంకింగ్స్ లో చైనాకు చెందిన ఐదు యూనివర్సిటీలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. భారత్ తరఫు నుంచి ఐఐఎస్సీ-బీ ఆరో స్థానంలో నిలిచింది.
గత ఏడాది కంటే ఒక ర్యాంకు దిగజారిన ఐఐఎస్సీ-బీ స్థానం భారత్ తరఫు నుంచి మాత్రం మొదటిస్థానంలో నిలిచింది. భారత్ తరఫు నుంచి గత ఏడాది టాప్ టెన్ లో నిలిచిన యూనివర్సిటీల్లో మొదటి ఆరు యూనివర్సిటీలు తిరిగి తమ స్థానాలను నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యాయి. ఓవరాల్ గా మిగతా దేశాలతో కలిపి మొదటి 50 స్థానాల్లో కేవలం 8 భారతీయ యూనివర్సిటీలు ర్యాంకింగ్స్ లో స్థానాన్ని దక్కించుకున్నాయి.
కాగా, 2015లో 200 స్థానాలకు క్యూఎస్ ర్యాంకింగ్స్ ను విడుదల చేయగా 31 భారతీయ యూనివర్సిటీలు చోటు సంపాదించాయి. ఈ ఏడాది 44 స్థానాలకు పరిమితమైన భారత్, చైనా(86), రష్యా(55), బ్రెజిల్(54)ల కంటే వెనుకబడింది. ర్యాంకింగ్స్ పై మాట్లాడిన బెన్ సౌటెర్, హెడ్ ఆఫ్ రీసెర్చ్, క్యూఎస్, ర్యాంకింగ్స్ లో 50 స్థానాలను పెంచడం వల్ల భారత్ లో పరిశోధనాత్మక విద్య వేళ్లూనుతోందని తెలుస్తోందని చెప్పారు. ర్యాంకులు సాధించిన 44 భారతీయ యూనివర్సిటీల్లో 12 యూనివర్సిటీల పరిశోధనలు చైనా, రష్యా, బ్రెజిల్ లు చేస్తున్న పరిశోధనలకు దీటుగా ఉన్నట్లు తెలిపారు.