డెరా బాబా ఖైదీ నెంబర్. 1997
లగ్జరీ లైఫ్‌ను, ప్రభుత్వం హైలెవల్ సెక్యురిటీని ఇన్నిరోజులు ఫుల్‌గా ఎంజాయ్ చేసిన డెరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఇక జైల్లో ఊసలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరు మహిళలపై అత్యాచార కేసులో గుర్మీత్ సింగ్‌కు ఇరవై ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జగ్దీప్ సింగ్ నేడు(సోమవారం) శిక్షను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు రెండు జతల జైలు బట్టలను అందించారు. ఖైదీ నెంబర్. 1997ను గుర్మీత్‌కు కేటాయించి, సెల్‌లోకి తరలించారు. ఇన్నాళ్లూ కళ్లుమిరుమిట్లు గొలిపేలా రంగురంగుల దుస్తులేసుకున్న బాబా నేటి శిక్ష ఖరారుతో మరో 20 ఏళ్లపాటు వాటికి దూరంగా ఉండాల్సిందే. 20 ఏళ్ల కఠినకారాగార శిక్ష విధిస్తూ జడ్జి తీర్పును చదివిన వెంటనే, గుర్మీత్ రామ్ అక్కడిక్కడే కూలబడిపోయినట్టు బోరున విలపించారు. రెండు చేతులు జోడించి, తనను క్షమించి శిక్ష తగ్గించమని జడ్జిని వేడుకున్నారు.
తాను అమాయకుడని, సామాజిక కార్యకలాపాలను చేస్తున్న నేపథ్యంలో తనను కరుణించాలని కోరుకున్నారు. అయితే గుర్మీత్ వేడుకను జడ్జి తోసిపుచ్చారు. నమ్మివచ్చిన సాధ్వీపై ఇలా అత్యాచారానికి పాల్పడటం క్షమించరాని నేరమని జడ్జి పేర్కొన్నారు. ఒక్కో కేసుకు పదేళ్ల చొప్పున, 20ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సిందేనని జడ్జి తీర్పునిచ్చారు. అంతేకాక రూ.30 లక్షల జరిమానాను కూడా గుర్మీత్‌కు విధించారు.
గుర్మీత్‌ను సాధారణ ఖైదీలాగానే చూడాలన్న జడ్జి, రోహతక్ జైలు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వీఐపీలాగ గుర్మీత్‌ను చూడటంపై అధికారులను మందలించారు. రేపిస్టులకు అదనపు సౌకర్యాలు కల్పిస్తారా అంటూ జైలు అధికారులకు చివాట్లు పెట్టారు. గుర్మీత్ వేసిన శిక్షపై అటు బాధితులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మరింత కఠినంగా శిక్ష విధించాలని వారు కోరుతున్నారు. గుర్మీత్‌కు విధించిన శిక్షను పలు పార్టీలు స్వాగతించాయి. అటు సీబీఐ తీర్పుపై సవాల్ చేసేందుకు గుర్మీత్ లాయర్లు సిద్ధమయ్యారు. శిక్ష ఖరారు సందర్భంగా కూడా కోర్టులో బాబాకు అనుకూలంగా గట్టివాదనలే వారు వినిపించారు.