రైళ్లలో రెడీ టు ఈట్ మీల్స్
రైళ్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా కేంద్రం పలు చర్యలు ప్రకటించింది. ఇందులోభాగంగా తినడానికి సిద్ధంగా ఉన్న(రెడీ టు ఈట్) ఆహార పదార్థాలను రైళ్లలో అందించనున్నట్లు, ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వే మంత్రి సదానంద గౌడ పార్లమెంట్లో వెల్లడించారు. నాణ్యత, భిన్నత్వం కోసం రైళ్లలో ‘రెడీ టు ఈట్’ ఆహార ఉత్పత్తులను దశలవారీగా ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక రైళ్లలో కేటరింగ్ సేవల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు మరో సంస్థతో తనిఖీలు(థర్డ్ పార్టీ ఆడిట్) నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించారు. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ ఆధ్వర్యంలో ఈ తనిఖీ వ్యవస్థను రూపొందించనున్నట్లు ప్రతిపాదించారు.
ఇందులోభాగంగా ఐవీఆర్ఎస్ విధానంలో ఆహార నాణ్యతపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టే పద్ధతిని త్వరలో అమలు చేయనున్నట్లు చెప్పారు. శుభ్రత, రుచి విషయంలో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేసినపక్షంలో సదరు విక్రయదారుపై కఠిన చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టును రద్దు చేస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రధాన రైల్వే స్టేషన్లలో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎక్కడికక్కడ స్థానిక రుచులను అందించనున్నట్లు, ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా ఆర్డర్లు స్వీకరించే సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ముందుగా న్యూఢిల్లీ-అమృత్సర్, న్యూఢిల్లీ-జమ్మూతావి సెక్షన్లలో ఈ సేవలను త్వరలోనేఅమలు చేయనున్నట్లు ప్రకటించారు.