నాణ్యమైన సరుకులు అందించాలి : జేసీ
కలెక్టరేట్, న్యూస్‌లైన్: అమ్మహస్తం పథం కింద లబ్ధిదారులకు నాణ్యమైన తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ ఆదేశించారు. జేసీ బుధవారం తన చాంబర్లో పౌరసరఫరాల శాఖ గోదాముల ఇన్‌చార్జ్‌లు, డీలర్లు, డిప్యూటీ తహసీల్దార్లతో సమావేశమై మాట్లాడారు. అమ్మహస్తం కింద నాణ్యమైన సరుకులను మాత్రమే చౌకధర దుకాణాలకు చేరవేయాలని, ఈ విషయంలో అలసత్వాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అవసరానికి తగినట్లుగా ముందే ట్రాన్సుపోర్టుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. డిమాండ్ అవసరాలను బట్టి కందిపప్పు, చక్కెర, గోధుమలు వినియోగదారులకు అందించాలని కోరారు.
మండల గోదాముల స్థాయిలో స్టాకు వివరాలను ఎప్పటికపుడు సెల్‌ఫోన్ ద్వారా ఆన్లైన్లో తెలియజేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆన్లైన్ ద్వారా స్టాకు వివరాలు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్, ఎండీకి నివేదికలు పంపాలని ఆదేశించారు. 17 గోదాములకు గాను 5 గోదాముల స్థాయిలో ఆన్లైన్ ద్వారా స్టాకు వివరాలు పర్యవేక్షిస్తున్నామని, మిగిలిన వారందరూ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. దీపం పథకం కింద సాధారణ కోటాగా 14,400 మంజూరుకాగా, 7253 గ్రౌండింగ్ పూర్తిచేశామని, మిగిలిన 7220 దీపం కనెక్షన్ల గ్రౌండింగ్‌కై చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్ సీడింగ్ కార్యక్రమంలో రాష్ట్రంలో 4వ స్థానంలో ఉన్నామని త్వరలో పెండింగ్‌లో ఉన్న ఆధార్ సీడింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో డీఎస్వో నాగేశ్వర్రావు, ఏఎస్వో వెంకటేశ్వర్లు, ప్రద్యుమ్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.