ఒడిదుడుకుల వారం
♦ ఆగస్టు సిరీస్ ఎఫ్ అండ్ ఓ ముగింపు ఈ వారంలోనే
♦ క్యూ1 జీడీపీ గణాంకాలపై మార్కెట్ దృష్టి
♦ నీలేకని రీఎంట్రీతో అందరి చూçపూ ఇన్ఫోసిస్‌పైనే
ముంబై: ఈ వారం స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారంలోనే ముగియనుండటం, జీడీపీ, పీఎంఐ గణాంకాలు వెలువడుతున్నందున స్టాక్‌సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతాయని వారంటున్నారు. వీటికి తోడు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, ప్రపంచ స్టాక్‌మార్కెట్ల పోకడ.. తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులంటున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్(క్యూ1) జీడీపీ గణాంకాలను ఈ నెల 31న(గురువారం–ఇదే రోజు ఆగస్టు సిరీస్ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టులు కూడా ముగుస్తాయి)మార్కెట్ ముగిసిన తర్వాత ప్రభుత్వం వెల్లడిస్తుంది. మార్కెట్ దృష్టి ఈ గణాంకాలపైన ఉంటుందని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్(పీసీజీ) టీనా వీర్మాణి చెప్పారు. కొత్త సీఈఓ ఎంపిక విషయమై ఇన్ఫోసిస్ యాజమాన్యం తీసుకునే చర్యలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని వివరించారు. ఇక శుక్రవారం (వచ్చే నెల 1న) తయారీ రంగానికి చెందిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు వస్తాయి.
వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌ల అధినేతల(జాక్సన్ హోల్) సమావేశ ఫలితాలు కూడా కీలకమేనని పేర్కొన్నారు. కాగా ఎలాంటి తాజా ట్రిగ్గర్లు లేనందున మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కదలాడే అవకాశాలున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. గత క్వార్టర్లో మంచి ఫలితాలు సాధించిన రంగాలు, కంపెనీలపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇన్ఫోసిస్ కంపెనీ చైర్మన్‌గా మళ్లీ నందన్ నీలేకని పగ్గాలు చేపట్టడంతో ఇన్ఫీపై అందరి చూపూ ఉంటుందని వివరించారు.
రూ.12వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వెనక్కి...
మన ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ రెండో వారం కూడా కొనసాగింది. తయారీ, సేవా రంగాలు మందగించడం, ఈ క్యూ1లో కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటం ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్ నుంచి రూ.12,626 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే డెట్ మార్కెట్లో మాత్రం రూ.13,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు.