‘నిమ్మగడ్డ’ నియామకంపై మరో పిటిషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నియామకం రాష్ట్ర మంత్రి మండలి సిఫారసు మేర జరగడానికి వీల్లేదని, పూర్తిగా రాష్ట్ర గవర్నర్ విచక్షణ మేరకే జరగాలంటూ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో, నిమ్మగడ్డ రమేశ్ నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ 2016లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో 11ను కొట్టేయాలని కోరుతూ గుంటూరు జిల్లా, ఉప్పలపాడు గ్రామానికి చెందిన సంగం శ్రీకాంత్‌రెడ్డి కో వారెంట్ రూపంలో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో, ఏ అధికారంతో ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్నారో నిమ్మగడ్డ రమేశ్‌ను వివరణ కోరాలంటూ హైకోర్టును అభ్యర్థించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ముఖ్య కార్యదర్శి స్థాయికి తక్కువ కాని అధికారిని ప్రభుత్వ సిఫారసు మేరకు గవర్నర్ నియమించాలంటున్న ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 200 (2)ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు దీనిని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తించకుండా నిమ్మగడ్డను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన హైకోర్టును కోరారు. (హైకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ నియామకమే చెల్లదు)