డేటావిండ్ ఉద్యోగుల తొలగింపు: ఆందోళన
హైదరాబాద్: తక్కువ ధరల టాబ్లెట్ తయారీ సంస్థ డాటా విండ్ ఉద్యోగులపై వేటు వేసింది. ముఖ్యంగా అమ్మకాలు భారీగా పడిపోవడంతో డజన్లకొద్దీ ఉద్యోగులను తొలగించిందని ఉద్యోగులు ఆందోళకు దిగారు. ఉత్పత్తిలో 50శాతం కోత పెట్టిందని ఆరోపిస్తూ దాదాపు 200 మంది కార్మికులు లేబర్ కమిషన్‌ను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ పిటిషన్ ఇచ్చారని తెలంగాణా జాయింట్ కమిషనర్(లేబర్) చంద్ర శేఖరం పీటీఐకి చెప్పారు.
తాము ఉద్యోగుల నుంచి పిటిషన్‌ను స్వీకరించామని సంస్థ వెర్షన్ వినడానికి త్వరలోనే వారిని పిలవనున్నామని చంద్రశేఖరం తెలిపారు. ఎంత మంది కార్మికులు అనేది స్పష్టతలేనప్పటికీ, అయితే వీరి సంఖ్య 200 కన్నా ఎక్కువ ఉంటుందని ఆయన అన్నారు
అయితే ఈ వ్యవహారంపై కంపెనీని సంప్రదించినపుడు సంస్థ భిన్నంగా స్పందించింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు తమ ఆఫీసును ధ్వంసం చేశారని కంపెనీ ఆరోపించింది. విమానాశ్రయ విస్తరణలో భాగంగా జీఎంఆర్‌కు కొంత స్థలం అవసరమైందనీ, ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో ఒక కొత్త కార్యాలయాన్ని ప్రారంభించాలని తాము యోచిస్తున్నట్టు చెప్పినా వినలేదనీ, చాలామంది శంషాబాద్ చుట్టూ పక్కలేఉండడంతో ఆందోళన చెందారని చెప్పారు. ఈ తరలింపు ఇష్టంలేని కొందరు తమపై ఫిర్యాదు చేసినట్టు వివరించారు. అందుకే వారిని తొలగించినట్టు చెప్పారు.
ఉత్పత్తి 50శాతం క్షీణించిందనీ, అయితే హైదరాబాద్‌ను ప్లాంట్ ను మూసివేయడంలేదని స్పష్టం చేసింది. హైదరాబాద్ ప్లాంట్ భాగాల ఎగుమతికోసం ఎదురుచూస్తుండగా, అమృత్సర్ ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉందని చెప్పింది. 2017 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల్లో అమ్మకాలు గణనీయంగా తగ్గాయని డాటావిండ్ సీఈవో సునీత్ సింగ్ తులి మార్కెట్ ఫైలింగ్ లో పేర్కొన్నారు.
కాగా హైదరాబాద్‌లో 100 కోట్ల రూపాయల పెట్టుబడులతో మొదలైన డేటావిండ్ సంస్థ మొదటి సంవత్సరంలో రెండు మిలియన్ యూనిట్లు (టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు) ఉత్పత్తి చేయనున్నామని ప్రకటించింది. తమ పూర్తి సామర్థ్యం 5 మిలియన్ యూనిట్లకు చేరుకోనుందని 2016 నవంబరులో ప్రకటించింది. మరోవైపు తక్కువ ధర డేటా ప్రణాళికలను ప్రారంభించనున్నామని, వచ్చే నెల లో ఫీచర్ ఫోన్ల కోసం మొబైల్ బ్రౌజర్ ప్రారంభించటానికి సిద్ధమవుతున్నామని డేటా విండ్ చెప్పింది. ఇది కూడా జావా ఆధారిత ఫీచర్ ఫోన్ లో వినియోగదారులు వేగవంతమైన డేటా అనుభవాన్ని అందించేలా లాంచ్ చేయనున్నామని ప్రకటించింది.