సంక్రాంతి వరకూ వణుకే..
* కోస్తాంధ్ర, తెలంగాణలో చలి తీవ్రం
* ఉత్తరాది నుంచి శీతల గాలులు
* పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: కొద్ది రోజుల విరామం తర్వాత చలి ఊపందుకుంటోంది. ఇటు ఏపీ, అటు తెలంగాణ రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ఉత్తరాదిలో వాతావరణం కూడా ఇందుకు దోహదపడుతోంది. అక్కడ నుంచి వీస్తున్న శీతల పవనాలు ఇక్కడ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే పరిస్థితి మరో వారం రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉత్తరాది వాతావరణ ప్రభావం వలన తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలి పారు. ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమల్లోను, తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. కోస్తాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 7 డిగ్రీలు, రాయలసీమలో 2 నుంచి 4, తెలంగాణలో 3 నుంచి 6 డిగ్రీల చొప్పున సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు వచ్చే 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్‌లలో చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది.