ఆ కుక్కను పట్టిస్తే ఐదు లక్షల బహుమతి
చెన్నైకు చెందిన శరవణన్, ఆయన భార్య సంగీత, తమ ఫేస్బుక్లో ఒక విచిత్రమైన పోస్టర్ ఒకటి వుంచారు. అదేమంటే మే -17న తాము పెంచుకుంటున్న మోంగ్రెయిల్ జాతికి చెందిన ‘అంబూ’ అనే అతి ఖరీదైన కుక్క సాలిగ్రామంలోని తమ ఇంటిలో నుంచి అదృశ్యమైందని, దానిని పట్టిచ్చిన వారికి అక్షరాలా 5 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ఆ పోస్టర్లో ముద్రించారు. శునకం తాలుకు వివరాలు తెలిస్తే 9940393023 లేదా 08105302635 నెంబర్లకు ఫోన్ చేయాలని వారు ఆ పోస్టర్లో పేర్కొన్నారు.
అంబూ అని పిలిస్తే ఈ కుక్క వెంటనే స్పందిస్తుందన్నారు. నగరానికి చెందిన బ్లూక్రాస్ సొసైటీ ఫేస్బుక్ పేజీలో సైతం వారు ఈ పోస్టర్ను వుంచామని తెలిపారు. అత్యంత వేగంగా పరుగెత్తడం ఈ కుక్క ప్రత్యేకత అన్నారు. గోధుమరంగు తెలుపు వర్ణం కలిగిన ఈ కుక్క తమకెంతో ఆప్తురాలని సంగీత అందులో పేర్కొన్నారు. గత ఏడాది తిరుపతిలోని బ్లూక్రాస్ సొసైటీ నుంచి అంబూను తెచ్చుకున్నామని ఆమె తెలిపారు. కెనడా పర్యటనలో ఉన్న తనకు అంబూ మాయమైందని తెలియగానే ఆగమేఘాలమీద చెన్నైకి చేరుకున్నామని ఆమె తెలిపారు.
తమ పోస్టర్ మెసేజికి వచ్చిన లైకుల సంఖ్యను చూసిన తర్వాత తమ అంబూ తమకు దొరుకుతుందన్న నమ్మకం కలిగిందన్నారు. చెన్నై బ్లూక్రాస్ సొసైటీ జిఎం డాన్ విలియమ్స్ ఎలాగైనా అంబూను కనిపెడతామని ధృడంగా తెలిపారు. సరిగ్గా 15 రోజుల కిందట బ్రాడ్వేకు చెందిన ఒక న్యాయవాది పెంచుకుంటున్న జర్మన్ జాతి పిల్లిని దొంగిలించిన నేపథ్యంలో అంబూను కూడా దుండగులు దొంగిలించి వుండవచ్చని శరవణన్ సందేహాన్ని వ్యక్తం చేశారు.