హీరో ఎలక్ట్రిక్ రిక్షా వచ్చింది..
ధర రూ. 1.10 లక్షలు
న్యూఢిల్లీ: విద్యుత్తుతో నడిచే వాహనాలను తయారు చేసే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ రాహి పేరుతో ఒక ఎలక్ట్రిక్ రిక్షాను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఎలక్ట్రిక్ రిక్షా ధర రూ.1.10 లక్షలు(ఆన్ రోడ్, ఢిల్లీ) అని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ చెప్పారు. రోజూ నగరాల్లో ప్రయాణించేవారికి, డ్రైవర్లకు ఇబ్బందులు తగ్గించేలా ఈ ఎలక్ట్రిక్ రిక్షాను రూపొందించామని పేర్కొన్నారు. 1,000 వాట్ల మోటార్ ఉన్న ఈ రిక్షాను ఒక్కసారి చార్జింగ్ చేస్తే 90 కి.మీ. ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) ధ్రువీకరణ పొందిన ఈ ఎలక్ట్రిక్ రిక్షాలో ప్రయాణికులు,
డ్రైవర్ల కోసం అంతర్గత ఎల్ఈడీ లైట్లు, డ్రైవర్ కోసం యూఎస్బీ మొబైల్ చార్జర్, సైడ్ కర్టెన్స్, ప్రయాణికుల వెన్నెముకకు బ్యాక్ సపోర్ట్ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 120 మంది డీలర్ల నెట్వర్క్ ద్వారా వీటిని అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ఈ మోడల్లో అప్‌గ్రేడేడ్ వేరియంట్‌ను త్వరలో అందిస్తామన్నారు. పశ్చిమబెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్‌ల్లో భారీ సంఖ్యలో ఈ ఎలక్ట్రిక్ రిక్షాలను విక్రయించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. దక్షిణ భారత మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటిదాకా లక్షకు పైగా ఎలక్ట్రిక్ టూవీలర్లను విక్రయించామని తెలిపారు.