ఆచార్య రాచపాళెంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
‘మన నవలలు, మన కథానికలు’ విమర్శనా గ్రంథానికి గుర్తింపు
రాచపాళెంకు అభినందనలు తెలిపిన జగన్
సాక్షి, కడప/ తిరుపతి: రాష్ట్ర స్థాయిలో ఉత్తమ విమర్శకునిగా విశేష గుర్తింపు సాధించిన ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన ‘మన నవలలు, మన కథానికలు’ పుస్తకానికి ఉత్తమ విమర్శకుడిగా ఈ పురస్కారం దక్కింది. దేశవ్యాప్తంగా సాహిత్యంలో విశేష సేవలు అందించిన 24 మంది ప్రముఖులకు అకాడమీ శుక్రవారం అవార్డులు ప్రకటించింది.
వచ్చే ఏడాది మార్చి తొమ్మిదో తేదీన జరగనున్న అకాడమీ వార్షికోత్సవ వేడుకల్లో పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఉంటుందని అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు న్యూఢిల్లీలో వెల్లడించారు. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి 1948 అక్టోబర్ 16న చిత్తూరుజిల్లా, తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకంలో మంగమ్మ, రామిరెడ్డిలకు జన్మించారు. ఎస్వీ, ఎస్కే విశ్వవిద్యాలయాలలో తెలుగుశాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు.
వైఎస్సార్ జిల్లాలోని యోగివేమన యూనివర్సిటీనుంచి పదవీ విరమణ చేసి ప్రస్తుతం సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రానికి ప్రధాన బాధ్యులుగా సేవలంది స్తున్నారు. అరసం ఏపీ అధ్యక్షులుగా, జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర సాహిత్య లోకంలో ఉత్తమ స్థాయి రచయితగా, నిబద్ధత గల విమర్శకునిగా ఆయనకు విశేషమైన గుర్తింపు ఉంది. రాయలసీమ రైతు జీవితాన్ని ప్రతిబింబించేలా ‘పొలి’ పేరిట దీర్ఘ కవితను సైతం వెలువరించారు.
ప్రముఖ సీనియర్ కథా రచయిత కాళీపట్నం రామారావు ఏర్పాటు చేసిన ‘కథా నిలయం’ ప్రారంభించిన అరుదైన గౌరవం ఆయనకు దక్కింది. ఆయన దశాబ్ది తెలుగు కథ పేరిట 50 సంవత్సరాల తెలుగు సాహిత్యంపై విద్యార్థులతో పరిశోధనలు చేయించారు. 28 సాహిత్య గ్రంథాలు, పలు అనువాద గ్రంథాలు వెలువరించారు. ఆయన నేతృత్వంలో 25మంది పీహెచ్డీలు, 20 మంది ఎంఫిల్ చేశారు. సీమ సాహితి పత్రికకు సంపాదకత్వం వహించారు. పలు రాష్ట్ర, జాతీయ, సాహితీ సదస్సులు, ప్రముఖ కవుల శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు.
రాచపాళెంకు జగన్ అభినందన
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన ప్రముఖ రచయిత రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. చంద్రశేఖరరెడ్డి అవార్డుకు ఎంపిక కావడమనేది ఆయనకు లభించిన సరైన గుర్తింపు అని జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాయలసీమ సాహితీ ఉద్యమంలో, అభ్యుదయ రచయితల సంఘంలోనూ రాచపాళెం ప్రముఖ భూమిక పోషిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో ప్రశంసించారు.
ఉత్తమ సమాజం కోసం ఉత్తమ విమర్శ: రాచపాళెం
సాహిత్యం సమాజం నుంచి, సమాజం కోసమే పుడుతుంది. ఆకాశం నుండి ఊడిపడదు. సాహిత్యం జీవితానికి ప్రతిబింబం లాంటిది. దాన్ని శాస్త్రీయంగా వ్యాఖ్యానిస్తే విమర్శ అవుతుంది. ‘మంచి సమాజం కావాలంటే మంచి సాహిత్యం రావాలి. మంచి సాహిత్యం రావాలంటే మంచి సాహిత్య విమర్శ కావాలి’ అన్నారు ప్రముఖ సీనియర్ రచయిత కొడవటిగంటి కుటుంబరావు. నేను ఈ మాట నుంచే విమర్శన రంగంలోకి వచ్చేందుకు స్ఫూర్తి పొందాను.