రచ్చ చేస్తారు!
నవీన్‌చంద్ర, తులికా గుప్త జంటగా రూపొందుతోన్న చిత్రం ‘రచ్చ రంబోలా’. ధర్మ-రక్ష కలిసి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బందరు బాబి, నాని క్రిష్ణ నిర్మాతలు. ఈ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నాగబాబు కెమెరా స్విచాన్ చేయగా, శ్రీకాంత్ క్లాప్ ఇచ్చారు. హరీశ్‌శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. నవీన్‌చంద్ర మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ ప్రేమకథల్లోనే నటించిన నాకు ఇదొక కొత్త అనుభవం. తొలిసారి పక్కా మాస్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాను. యాక్షన్, కామెడీ, లవ్... ఇలా అన్ని అంశాలూ ఈ కథలో ఉంటాయి.
నటునిగా నాకు ఈ సినిమా మరో మంచి మలుపు అవుతుంది’’ అని చెప్పారు. ‘‘మా కథకు తగ్గ కథానాయకుడు నవీన్‌చంద్ర. అడగ్గానే ఈ సినిమా చేయడానికి ఆయన అంగీకరించినందుకు థ్యాంక్స్. రాజీ అనే పదాన్ని ఇష్టపడని నిర్మాతలు మాకు దొరికారు. తప్పకుండా జనరంజకమైన సినిమాను తెరకెక్కిస్తాం’’ అని దర్శకులు అన్నారు. చిరంజీవికి ‘ఖైదీ’లా... నవీన్‌చంద్రకు ఈ సినిమా టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనీ, ఈ నెల 16న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, రెండు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తామనీ, సమ్మర్లో విడుదల చేస్తామనీ నిర్మాతలు తెలిపారు.
నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రను ఇందులో చేస్తున్నానని కథానాయిక తులికా చెప్పారు. అతిథి, రావురమేశ్, అజయ్, పోసాని కృష్ణమురళి, జీవా, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్, కెమెరా: ఎస్వీ విశ్వేశ్వర్, కూర్పు: రవి మన్ల, నిర్మాణం: నానిగాడి సినిమా.