బీడీఎల్ అధికారులపై గిరిజనుల దాడి
నల్లొండ : నల్గొండలో గిరిజనుల ఆందోళనతో బుధవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. క్షిపణి ప్రయోగ స్థల పరిశోధనకు నారాయణపురం మండలం ఐదు బోనాల తండాకు వచ్చిన బీడీఎల్ అధికారులపై గిరిజనులు దాడి చేశారు. రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై కిరోసిన్ పోశారు. క్షిపణి ప్రయోగానికి స్థలం ఇచ్చేది లేదంటూ అధికారులు వచ్చిన వాహనాలకు ధ్వసం చేసి అద్దాలు పగులగొట్టారు. గిరిజనులు ఒక్కసారిగా రెచ్చిపోవటంతో అధికారులు మిన్నుకుండిపోయారు. అనంతరం చేసేది లేక వెనుదిరిగారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ తాము క్షిపణి ప్రయోగానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తామో.... అధికారులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
ఇక నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని రాచకొండ గుట్టల్లో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. దీనికి స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ముందుకు వెళ్లడానికే ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు.. ఈప్రాంతంలో రాచకొండ ఫైల్డ్ ఫీరింగ్ రేంజ్ (ఆర్ఎఫ్ఎఫ్ఆర్) ఏర్పాటు నిమిత్తం ఆర్మీకి ఇచ్చేందుకు నిర్ణయించిన 6975.39 హెక్టార్ల అటవీ భూమిలో 5360.11 హెక్టార్ల భూమిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)కు బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.