అట్టహాసంగా ప్రారంభమైన ఖేల్‌ఇండియా క్రీడలు
గోపవరం (బద్వేలు) : బద్వేలు, గోపవరం మండలాల్లో శనివారం అట్టహాసగా ఖేల్‌ఇండియా క్రీడలు ప్రారంభమయ్యాయి. గోపవరం మండలానికి సంబంధించి రాచాయపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్రీడలను ఎమ్మెల్యే జయరాములు ప్రారంభించారు. బద్వేలు మండలానికి సంబంధించి బిజివేములవీరారెడ్డి డిగ్రీకళాశాలలో ఎంపీడీఓ డాక్టర్ వెంకటేష్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఈ క్రీడలు దోహదపడనున్నాయన్నారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలస్థాయి విద్యార్థులను అందరిని ఒకచోటకు తీసుకువచ్చి క్రీడలు నిర్వహించడం ఖేల్‌ఇండియా క్రీడల ప్రత్యేకత అన్నారు. క్రీడల్లో షార్ట్‌పుట్, పరుగుపందెం, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలను విద్యార్థులకు నిర్వహించారు. విజేతలుగా ఎంపికైన విద్యార్థులకు బహుమతులను అందచేశారు. కార్యక్రమంలో గోపవరం ఇన్‌ఛార్జి ఎంపీడీఓ నాగార్జునుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణశర్మ, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.