భలే..రేడియో క్యాబ్స్
సాక్షి, ముంబై : ఇక మీదట మీరు నగరంలోని ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే మీరు ట్యాక్సీల కోసం క్యూలో నిలబడే అవసరం లేకుండా రేడియో ట్యాక్సీలు మీ ముందుకు వచ్చి వాలుతున్నాయి. ఈ సేవలు ఇటీవలే ప్రారంభం కావడంతో ఎయిర్ పోర్టు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్యాక్సీ బుకింగ్ కౌంటర్ల వద్ద భారీ క్యూలో నిలబడాల్సి వస్తుందనీ, దీంతో చాలా సమయం వృథా అవుతోందని ప్రయాణికుల నుంచి ఫిర్యాదు వెలువెత్తాయి. దీన్ని అధిగమించేందుకు ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్) ట్యాక్సీల కోసం ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను తమ వెబ్సైట్లో ప్రారంభించింది. ప్రయాణికులు రేడియో క్యాబ్‌ల కోసం చాలా తక్కువ వ్యవధిలో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ సేవలు డోమాస్టిక్ (1ఎ 1బి), ఇంటర్నేషనల్ టీ2 టర్మినస్ ఇరు ఎయిర్ పోర్టుల వద్ద కూడా ప్రారంభించారు.
సమయం ఆదా
ఇక మీదట ఎయిర్ పోర్ట్ ప్రయాణికులు క్యాబ్‌ల కోసం పొడువాటి క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికులకు క్యాబ్‌లను బుక్ చేసుకోవడానికి కనీసం మూడు గంటల సమయం పడుతోంది. ప్రయాణికుల స్పందననుబట్టి రెండునుంచి గంట వరకు సమయం ఆదా అవుతోందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సేవలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యార్థమే ఈ సేవలను ప్రారంభించామని ఎంఐఏఎల్ అధికార ప్రతినిధి చెప్పారు. ఆన్లైన్లో రేడియో క్యాబ్‌లను బుక్ చేయడం కేవలం 60 సెకండ్లలోనే ముగిస్తుందని వారు పేర్కొన్నారు.
ప్రయాణికుల స్పందన
క్యూలో నిలబడి గంటల సమయం వృథా చేసుకునే పని తప్పిందని ప్రయాణికులు అంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ట్యాక్సీల కోసం వేచి చూడడం ఇబ్బందికరంగా మారిందని ప్రయాణికులు పేర్కొన్నారు. సమావేశాలు ఇతర చిన్న చిన్న పనులను ముగించుకొని అదే రోజు ప్రయాణమయ్యే వారికి ఈ సేవలు ఎంతో సౌకర్యంగా ఉంటాయని తరచూ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించే అపూర్వ తెలంగ్ పేర్కొన్నారు. అధికారుల నిర్ణయం హ ర్షణీయమని మరో ప్రయాణికుడు కరణ్ పాల్ సింగ్ సేథ్ అన్నారు. తరచూ ఎయిర్ లైన్స్ల్లో ప్రయాణించే తమ లాంటి వారి కోసం ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.