వారిని రేపటిలోగా కోర్టులో హాజరుపరచాలి
సాక్షి, హైదరాబాద్: పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రజా సంఘాల నేతలను శుక్రవారం ఉదయంలోగా కోర్టులో హాజరు పరచాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆదేశించారు. మావోయిస్టు సానుభూతిపరులనే ఆరోపణలపై చైతన్య మహిళా సంఘం సభ్యులైన దొంగరి దేవేంద్ర, దువ్వాసి స్వప్న, విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంచు సందీప్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి అరెస్టును వ్యతిరేకిస్తూ చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అరెస్టు చేసిన వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఇంతకుమునుపే హైకోర్టు ఆదేశించింది. అయినా వారిని హాజరుపరచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. అరెస్ట్ చేసిన స్వప్న, దేవేంద్ర, సందీప్‌లను రేపటిలోగా కోర్టులో హాజరుపర్చలని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
చైతన్య మహిళా సంఘం సభ్యులు దేవేంద్ర, స్వప్నతోపాటు హైదరాబాద్ నల్లకుంటకు చెందిన మెంచు సందీప్‌ను మంగళవారం అర్ధరాత్రి కొత్తగూడెం పోలీసులు అరెస్టు చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేశ్చంద్ర ఓ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్న పలు సంఘాల నాయకులపై అక్టోబరులో చర్ల పోలీస్ స్టేషన్లో ‘ఉపా’ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా పేర్కొని పరారీలో ఉన్నందునే దేవేంద్ర, స్వప్న, సందీప్‌ను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు.