సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలు..
సంగారెడ్డి అర్బన్: సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేసే ఎన్నికల సామగ్రిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తనిఖీ చేసి సంబంధిత అధికారులకు అందించినట్టు తెలిపారు.
ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సకాలంలో తరలివెళ్లి అక్కడి ఏర్పాట్లను వెంటనే పూర్తి చేసుకోవాలన్నారు. పాటు మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌కాస్టింగ్ సిబ్బంది కూడా వెళ్లారని, శనివారం ఉదయం 6 గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించాలన్నారు. అనంతరం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఉప ఎన్నిక నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఓటరు స్లిప్‌లను ఓటర్లందరికీ అందించామని, ఇంకా ఎవరికైనా ఓటరు స్లిప్ అందని పక్షంలో పోలింగ్ కేంద్రం దగ్గర్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం నుంచి పొందవచ్చన్నారు. ఫొటో ఓటరు స్లిప్ లేనిపక్షంలో ఎన్నికల సంఘం సూచించిన ఏదేని ఒక కార్డును ఎన్నికల అధికారికి చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు.