Rahulraj collector
-
‘పెన్‌గంగ’పై అప్రమత్తం!
జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ ఉధృతి నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతమైన డొల్లార గ్రామ శివారు ప్రాంతాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదివారం పర్యటించారు. ఉదయం డొల్లార చేరుకొని 44వ నంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద పెన్‌గంగ ఉధృతిని పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడి పరిస్థితులపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంత ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం కొరటా–చనాఖా బ్యారేజీ, హట్టిఘాట్ పంప్ హౌస్‌లను సందర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు: వరద ధాటికి మండలంలోని పలు గ్రామాల్లో వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇళ్లలో ఉన్న బియ్యం, పప్పు, ఇతర నిత్యావసర సరుకులు పూర్తిగాతడిసిపోవడంతో అవస్థలు పడుతున్నారు. కౌఠ గ్రామంలో నిత్యావసర సరుకులను థర్మాకోల్ పడవలపై తరలిస్తూ కనిపించారు. ప్రజలు ఇళ్లను వదిలి మూటముల్లె సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. చెరువులను తలపిస్తున్న పంట చేలు పెన్‌గంగ పరీవాహక ప్రాంతం చుట్టూ ఉన్న పంట చేలు బ్యాక్ వాటర్ ధాటికి పూర్తిగా మునిగిపోయాయి. ఆదివారం వర్షం కొంత తగ్గినప్పటికీ చేలలో వరద తొలగలేదు. పెండల్వాడ, సాంగ్వి, ఆనంద్‌పూర్, కరంజి, కూర, ఖాప్రి, లేకర్వాడ, మాండగాడ, పూసాయి తదితర గ్రామాల పంట చేలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పెన్‌గంగా నది బ్యాక్ వాటర్ సాంగిడి గ్రామాన్ని చుట్టుముట్టడంతో ఆ గ్రామస్తులు బాహ్యప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామం నుంచి బయటకు రావాలంటే ఇలా నాటు పడవల ద్వారా ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోంది. -
క్యాష్‌లెస్ కాదు.. లెస్ క్యాష్
లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాలి ట్రెయినీ కలెక్టర్ రాహుల్‌రాజ్ డిచ్పల్లి : క్యాష్‌లెస్ కాదు.. లెస్‌క్యాష్ లావాదేవీలు అలవర్చుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ట్రెయినీ కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం సాయంత్రం డిచ్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు, బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్ష్యరాస్యులు అధికంగా ఉన్నారని అన్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో వంద శాతం క్యాష్‌లెస్ లావాదేవీలు ఆచరణ సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత ఉందని, ప్రజలు డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లలో పేటీఎం, ఫ్రీచార్జ్, ఎస్బీఐ బడ్డీ, ఇతర యాప్‌లు డౌన్లోడ్ చేయగానే సరిపోదని, వాటిని సురక్షితంగా ఏ విధంగా వాడాలనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల 15 వరకు డిచ్పల్లి మండలంలోని బర్ధిపూర్, అమృతాపూర్, నర్సింగ్‌పూర్, సుద్దులం గ్రామాలతో పాటు ఇందల్వాయి మండలంలోని తిర్మన్‌పల్లి, చంద్రాయన్పల్లి గ్రామాలను లెస్‌క్యాష్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. అలాగే డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో ఎంపిక చేసిన తొమ్మిది గ్రామాలలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి చేసి, ఈ నెల 20 లోగా బహిరంగ మలవిసర్జన లేని (ఓడీఎఫ్) గ్రామాలుగా ప్రకటించాలని రాహుల్‌రాజ్ అన్నారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి డాక్టర్ భరత్, ఎంపీడీవో మర్రి సురేందర్, ఈవోపీఆర్డీ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ గణేశ్, పీఆర్ ఏఈ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.