
జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ ఉధృతి నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతమైన డొల్లార గ్రామ శివారు ప్రాంతాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదివారం పర్యటించారు. ఉదయం డొల్లార చేరుకొని 44వ నంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద పెన్‌గంగ ఉధృతిని పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడి పరిస్థితులపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంత ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం కొరటా–చనాఖా బ్యారేజీ, హట్టిఘాట్ పంప్ హౌస్‌లను సందర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
సురక్షిత ప్రాంతాలకు ప్రజలు:
వరద ధాటికి మండలంలోని పలు గ్రామాల్లో వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇళ్లలో ఉన్న బియ్యం, పప్పు, ఇతర నిత్యావసర సరుకులు పూర్తిగాతడిసిపోవడంతో అవస్థలు పడుతున్నారు. కౌఠ గ్రామంలో నిత్యావసర సరుకులను థర్మాకోల్ పడవలపై తరలిస్తూ కనిపించారు. ప్రజలు ఇళ్లను వదిలి మూటముల్లె సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
చెరువులను తలపిస్తున్న పంట చేలు
పెన్‌గంగ పరీవాహక ప్రాంతం చుట్టూ ఉన్న పంట చేలు బ్యాక్ వాటర్ ధాటికి పూర్తిగా మునిగిపోయాయి. ఆదివారం వర్షం కొంత తగ్గినప్పటికీ చేలలో వరద తొలగలేదు. పెండల్‌వాడ, సాంగ్వి, ఆనంద్‌పూర్, కరంజి, కూర, ఖాప్రి, లేకర్‌వాడ, మాండగాడ, పూసాయి తదితర గ్రామాల పంట చేలన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
పెన్‌గంగా నది బ్యాక్ వాటర్ సాంగిడి గ్రామాన్ని చుట్టుముట్టడంతో ఆ గ్రామస్తులు బాహ్యప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామం నుంచి బయటకు రావాలంటే ఇలా నాటు పడవల ద్వారా ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment