
తాంసి: పెన్‌గంగ నదిలో నాటుపడవ ద్వారా రోజూ ప్రయాణికులను ఇరువైపులా ఒడ్డుకు సురక్షితంగా చేరుస్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా పెరిగిన నది ఉధృతిలో చిక్కుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. తాంసి మండలం వడూర్ గ్రామానికి చెందిన రావుల దాద్దీప పెన్‌గంగలో నాటుపడవ నడిపిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ప్రయాణికులను వడూర్–మహారాష్ట్ర వైపు ఉన్న నదీతీరాలకు చేరుస్తుంటాడు. అయితే శనివారం కురిసిన భారీవర్షానికి పెన్‌గంగ ప్రవాహం పెరిగింది. నదిలో ఉన్న పడవను బయటకు తీయడానికి దాద్దీప, స్నేహితులు అగు కుశల్, రేండ్ల శ్రీను ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది.
పడవలోనే ఉండిపోయిన ఈ ముగ్గురు ఒడ్డుకు చేరే మార్గం కానరాక భయాందోళన చెందారు. హాహాకారాలు చేయడంతో స్థానిక యువకులు గమనించి వెంటనే నదిలోకి దిగి ఈదుకుంటూ వెళ్లి కుశల్, శ్రీనును బయటకు తీసుకువచ్చారు. అయితే దాద్దీప పడవలోనే కొంతదూరం కొట్టుకుపోయి ఓ చోట చెట్ల కొమ్మలను పట్టుకున్నాడు. గంటకుపైగా బిక్కుబిక్కుమంటూ గడిపాడు. సమాచారం అందుకున్న భీంపూర్ ఎస్సై రాధిక అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. గంగపుత్రులు, స్థానిక యువకులు టైర్లు, తాళ్ల సాయంతో అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దాద్దీప ప్రాణాలతో బయటపడగా పడవ మాత్రం నీటి ప్రవాహంలోనే కొట్టుకుపోయింది.
ఇది కూడా చదవండి: గోదావరి ఉప నది ఉధృతి.. 20కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
Comments
Please login to add a commentAdd a comment