penganga
-
‘పెన్‌గంగ’పై అప్రమత్తం!
జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ ఉధృతి నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతమైన డొల్లార గ్రామ శివారు ప్రాంతాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదివారం పర్యటించారు. ఉదయం డొల్లార చేరుకొని 44వ నంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద పెన్‌గంగ ఉధృతిని పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడి పరిస్థితులపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంత ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం కొరటా–చనాఖా బ్యారేజీ, హట్టిఘాట్ పంప్ హౌస్‌లను సందర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు: వరద ధాటికి మండలంలోని పలు గ్రామాల్లో వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇళ్లలో ఉన్న బియ్యం, పప్పు, ఇతర నిత్యావసర సరుకులు పూర్తిగాతడిసిపోవడంతో అవస్థలు పడుతున్నారు. కౌఠ గ్రామంలో నిత్యావసర సరుకులను థర్మాకోల్ పడవలపై తరలిస్తూ కనిపించారు. ప్రజలు ఇళ్లను వదిలి మూటముల్లె సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. చెరువులను తలపిస్తున్న పంట చేలు పెన్‌గంగ పరీవాహక ప్రాంతం చుట్టూ ఉన్న పంట చేలు బ్యాక్ వాటర్ ధాటికి పూర్తిగా మునిగిపోయాయి. ఆదివారం వర్షం కొంత తగ్గినప్పటికీ చేలలో వరద తొలగలేదు. పెండల్వాడ, సాంగ్వి, ఆనంద్‌పూర్, కరంజి, కూర, ఖాప్రి, లేకర్వాడ, మాండగాడ, పూసాయి తదితర గ్రామాల పంట చేలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పెన్‌గంగా నది బ్యాక్ వాటర్ సాంగిడి గ్రామాన్ని చుట్టుముట్టడంతో ఆ గ్రామస్తులు బాహ్యప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామం నుంచి బయటకు రావాలంటే ఇలా నాటు పడవల ద్వారా ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోంది. -
తృటిలో తప్పిన ప్రమాదం.. వరదల్లో చిక్కుకుని బిక్కుబిక్కు..
తాంసి: పెన్‌గంగ నదిలో నాటుపడవ ద్వారా రోజూ ప్రయాణికులను ఇరువైపులా ఒడ్డుకు సురక్షితంగా చేరుస్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా పెరిగిన నది ఉధృతిలో చిక్కుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తాంసి మండలం వడూర్ గ్రామానికి చెందిన రావుల దాద్దీప పెన్‌గంగలో నాటుపడవ నడిపిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ప్రయాణికులను వడూర్–మహారాష్ట్ర వైపు ఉన్న నదీతీరాలకు చేరుస్తుంటాడు. అయితే శనివారం కురిసిన భారీవర్షానికి పెన్‌గంగ ప్రవాహం పెరిగింది. నదిలో ఉన్న పడవను బయటకు తీయడానికి దాద్దీప, స్నేహితులు అగు కుశల్, రేండ్ల శ్రీను ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. పడవలోనే ఉండిపోయిన ఈ ముగ్గురు ఒడ్డుకు చేరే మార్గం కానరాక భయాందోళన చెందారు. హాహాకారాలు చేయడంతో స్థానిక యువకులు గమనించి వెంటనే నదిలోకి దిగి ఈదుకుంటూ వెళ్లి కుశల్, శ్రీనును బయటకు తీసుకువచ్చారు. అయితే దాద్దీప పడవలోనే కొంతదూరం కొట్టుకుపోయి ఓ చోట చెట్ల కొమ్మలను పట్టుకున్నాడు. గంటకుపైగా బిక్కుబిక్కుమంటూ గడిపాడు. సమాచారం అందుకున్న భీంపూర్ ఎస్సై రాధిక అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. గంగపుత్రులు, స్థానిక యువకులు టైర్లు, తాళ్ల సాయంతో అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దాద్దీప ప్రాణాలతో బయటపడగా పడవ మాత్రం నీటి ప్రవాహంలోనే కొట్టుకుపోయింది. ఇది కూడా చదవండి: గోదావరి ఉప నది ఉధృతి.. 20కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ -
పెన్‌గంగ ఉగ్రరూపం
సాక్షి, ఆదిలాబాద్: గోదావరి ఉప నది పెన్‌గంగ ఉగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్ర నుంచి భారీగా వరద పోటెత్తింది. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న కోరాట–చనాఖా బ్యారేజీ పూర్తి స్థాయి నీటిమట్టం 213 మీటర్లుకాగా.. దాన్ని మించి 215.7 మీటర్ల ఎత్తున ప్రవాహం వస్తోంది. దీనితో బ్యారేజీ సమీపంలో నిర్మించిన పంపుహౌస్ ప్రమాదం అంచున నిలిచింది. మరో రెండు మీటర్ల ప్రవాహం పెరిగితే పంపుహౌజ్‌లోకి వరద పోటెత్తే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెన్‌గంగ ఉధృతికి భీంపూర్, జైనథ్, బేల మండలాల్లోని 10 జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. డొల్లార సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జిని తాకుతూ పెన్‌గంగ ప్రవహిస్తుండటంతో.. శనివారం రాత్రి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. -
గంగను తోడేస్తున్నారు..!
బేల: ఈ సారి అసలే వర్షాభావం, ఆపై ఇటీవల నుంచి మండుతున్న ఎండలతో ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను రూపొందిస్తూ భూగర్భ జలాలను పెంచడానికి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాంలు, చేన్లలో నీటి కుంటలు, తదితర వాటిని ఏర్పాటు చేస్తూ భూగర్భ జలాలను పెంచడానికి ప్రయత్నాలు చేస్తుంటే, మరో పక్క మండలంలోని పెన్‌గంగా నదిలో ఇసుక త్రవ్వకాలు ‘మాముల్’గానే సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక మాఫియా విచ్చల విడిగా, ఈ ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో పెన్‌గంగాలో గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ ఇసుకను మండలకేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలోని సిమెంటు ఇటుకల కేంద్రాలతో పాటు ఇతరత్ర వ్యాపార కేంద్రాలకు ఈ ఇసుకను తరలిస్తూ, లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. కానీ సంబంధిత ‘రెవెన్యూ’ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇదిలాగైతే..మండలంలోని మాంగ్రుడ్, కోగ్ధూర్, గూడ, బెదోడ, సాంగిడి గ్రామాల శివారులకు సమీపాన (మహారాష్ట్ర సరిహద్దుల్లో) పెన్‌గంగా నది ప్రాంతం ఉంటుంది. ఇందులో కోగ్ధూర్, బెదోడ గ్రామాల శివారులోని పెన్‌గంగా ప్రాంతం బాగా ఎత్తుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు అవకాశం ఉండదు. కాగా మిగితా మాంగ్రుడ్, గూడ, సాంగిడి గ్రామాల శివారుల్లో ఇసుక త్రవ్వకాలకు వీలు ఉంటుంది. దీంతో అత్యధికంగా ఈ మూడు ప్రాంతాల్లోని పెన్‌గంగాలో కూలీలే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రొక్లెయిన్, డోజర్లతో అక్రమ ఇసుక త్రవ్వకాలు యథేచ్ఛగా చేపడుతున్నారు. రాత్రి వేళల్లోనూ జోరు.. రాత్రి వేళల్లోనూ ఈ ఇసుక త్రవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. పగలు వేళల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పెన్‌గంగా ఒడ్డును దాటించి, గ్రామ శివారుల్లోని ప్రాంతాల్లోని చాలా చోట్ల ఇసుక నిల్వలను వేయిస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ ఇసుకను ప్రత్యేకంగా రాత్రివేళల్లో అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రివేళ ఇలా ఇసుక తరలింపుతో ట్రాక్టర్ల రాకపోకల శబ్ధాలతో తీవ్రంగా ఇబ్బందులు పడక తప్పడం లేదని కాఫ్రి, బెదోడ, మణియార్‌పూర్, గూడ, దహెగాం, కొబ్బాయి గ్రామాల ప్రజలు అంటున్నారు. ఈ తరలింపుపై పలువురు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా, ఏమాత్రం పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఇసుక త్రవ్వకాలను కట్టడి చేయకుంటే రాబోయే రోజుల్లో భూగర్భజలాలు తగ్గి, త్రాగు నీళ్లకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదముందని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ పనులకు ఈ ఇసుకను తీసుకెళ్తున్నారంటూ, ఈ త్రవ్వకాలపై రెవెన్యూ అధికారులు ‘మాముల్’గానే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఇసుక త్రవ్వకాలను ఎంతైనా కనీసం రాత్రివేళైనా అరికట్టాల్సి ఉందని మండల వాసులు అంటున్నారు. ఇసుక అక్రమ తరలింపు విషయమై మండల తహసీల్దార్ సుగుణాకర్ రెడ్డిని ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరగా..ఇప్పటిదాకా ఈ ఇసుక తరలింపు విషయం మా దృష్టికి రాలేదని పేర్కొన్నారు. మా దృష్టికి వచ్చినట్లైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఆదిలాబాద్ జిల్లాలో పొంగుతున్న వాగులు
ఆదిలాబాద్: రెండు రోజులుగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. పెన్‌గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో సైతం భారీగా వరదనీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పుడుతోంది. కొమురం భీం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. -
బోర్డు ఆమోదం తర్వాతే బ్యారేజీల పనులు
ఏప్రిల్ తొలివారంలో తెలంగాణ-మహారాష్ట్ర సీఎంల స్థాయిలో సమావేశం సాక్షి, హైదరాబాద్: గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై నిర్మించే మూడు బ్యారేజీల పనులను తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండే అంతర్రాష్ట్ర బోర్డు ఆమోదం తర్వాతే చేపట్టనున్నారు. అప్పటివరకు ప్రాజెక్టుల పరిధిలో చిన్నపాటి మా ర్పులు, అవసరమైన అనుమతులు, చేయాల్సిన సర్వేలను పూర్తిచేసుకోనున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల అధికారుల స్థాయిలో జరిగిన కమిటీ సమావేశాల్లో నిర్ణయించినట్లు తెలిసింది. ప్రాణహితపై నిర్మించే తమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో, మేడిగడ్డ బ్యారేజీని 100 మీటర్ల కనీస ఎత్తుతో నిర్మించేందుకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి మార్గంలో నిర్మించే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి వ్యయ అంచనాలు సిద్ధం చేసి పెట్టుకుంది. వాటికి పరిపాలనా అనుమతులు ఇచ్చేసి పనులు మొదలుపెట్టాలని భావించింది. ఈ పాటికే టెండర్ల ప్రక్రియను సైతం ముగించాలని భావించినా... అంతర్రాష్ట్ర చర్చల నేపథ్యంలో వాటిని నిలిపివేశారు. అయితే అధికారుల స్థాయి చర్చల అనంతరం పనులు మొదలు పెట్టేందుకు అవకాశం ఉంటుందని అంతా భావించినా... భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కా రం ఇవ్వకుండా బోర్డు ఆమోదం తర్వాతే పనులు మొదలుపెట్టాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఏప్రిల్ తొలివారంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఆ రాష్ట్ర జల వనరుల మంత్రి గిరీశ్ మహాజన్ రాష్ట్రానికి వచ్చే అవకాశముంది. -
‘పాలమూరు’కు టెండర్లు పిలవండి
* అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం * రెండు వారాల్లో పనులు మొదలుపెట్టాలి * మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీకి త్వరలో శంకుస్థాపన * పాలమూరు, పెన్‌గంగ, డిండి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకొని పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పాల మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు వెంటనే టెండర్లు పిలవాలని, రెండు వారాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో వేగం పెంచడానికి , త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయి అధికారులకు కూడా అధికారాలు బదలాయించాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి టి.హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, సీఈ హరిరామ్, రిటైర్డ్ ఇంజనీర్లు రంగారెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే పాల్గొన్నారు. వచ్చే ఏడాదిలో కాళేశ్వరానికి నీరు చేరాలి వచ్చే బడ్జెట్లో నీటి పారుదల శాఖకు కేటాయించే రూ.25 వేల కోట్ల నిధుల్లో ప్రతినెలా రూ.2,083 కోట్లు విడుదల చేస్తామని, అందు కు అనుగుణంగా పనులు జరగాలని సీఎం ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన రీడిజైన్లు పూర్తయినందున అన్ని ప్రాజెక్టుల పనులు ప్రారంభం కావాలన్నారు. పాలమూరు పరిధిలోని ఏదుల, కరివెన డిస్ట్రిబ్యూటరీ పనులకు సత్వరమే టెం డర్లు పిలవాలన్నారు. ఉద్దండాపూర్‌కు పనుల డిజైన్లు ఖరారు చేయాలన్నారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీకి త్వరలో శంకుస్థాపన చేయాలని, వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి నీరు చేరేలా పనులు జరగాలన్నారు. పెన్‌గంగ ప్రాజెక్టు టెండర్లను సైతం రెండు వారాల్లో పూర్తి చేయాలని, డిండి ప్రాజెక్టుకు కూడా త్వరగా టెండర్లు పిలవాలని సూచించారు. రూ.27వేల కోట్ల పనులు..18 ప్యాకేజీలు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని 62 మండలాల్లో 1,131 గ్రామాల పరిధిలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఉద్దేశంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూ.35,200 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు... నార్లాపూర్-8.1 టీఎంసీ, ఏదుల 6.5, వట్టెం 16.6, కరివెన 19.15, ఉద్ధండాపూర్ 92 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించారు. వీటి కోసం మొత్తంగా రూ.9,644 కోట్లతో అంచనాలు సిద్ధమయ్యాయి. ఇందులో వట్టెం రిజర్వాయర్‌కు గరిష్టంగా 3,780 కోట్లు కానుండగా, కరివెనకు రూ.2,490 కోట్లు, ఉద్ధండాపూర్కు రూ.2,115 కోట్లు, నార్లాపూర్‌కు రూ.801 కోట్లు, ఏదులకు రూ.458 కోట్లు అంచనా వ్యయంగా లెక్కించారు. వీటితో పాటు నార్లపూర్ నుంచి ఉద్ధండాపూర్ వరకు కాలువలు, టన్నెల్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం పనులను రూ.20,654.54 కోట్లుగా లెక్కగట్టగా... ఎలక్ట్రో మెకానికల్ పనులకు అదనంగా మరో రూ.6,258.72 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు సిద్ధం చేశారు. మొత్తంగా రూ.26,913.26 కోట్ల పనులను 18 ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో గరిష్టంగా ప్యాకేజీ-18లో రూ.2,169.94 కోట్ల పనులు ఉండగా, కనిష్టంగా ప్యాకేజీ-3లో రూ.427 కోట్ల పనులున్నాయి. అయితే ఈ ప్యాకేజీల విషయంలో నెలకొన్న సందిగ్ధత కారణంగా టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది. రూ.500 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల మధ్య టెండర్లు పిలవాలని అధికారుల స్థాయిలో నిర్ణయం జరగ్గా... మొబిలైజేషన్ అడ్వాన్సులు లేనందున ప్యాకేజీలను రూ.వెయ్యి కోట్లకు పైనే నిర్ణయించి పెద్ద కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచనలు చేశారు. సోమవారం జరిగిన సమావేశంలో ఈ విషయం చర్చకు రాగా సీఎం... నిర్ణయాధికారాన్ని అధికారులకే కట్టబెట్టారు. ఇప్పటికే విభజించిన ప్యాకేజీలకు అనుగుణంగా టెండర్లు పిలవాలని సూచించారు. ఇక సివిల్, ఎలక్ట్రోమెకానికల్ పనులను విభజించాలన్న సూచనను పక్కనపెట్టి.. అన్ని పనులకు ఒకే టెండర్ పిలవాలని నిర్ణయించారు. డిండికి లైన్‌క్లియర్... మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు డిజైన్‌కు సమావేశంలో ఓకే చేశారు. ఎలాంటి టన్నెల్ల నిర్మాణం లేకుండా కాలువల ద్వారా నీటిని అందించే ప్రణాళికకు ఆమోదం లభించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే ఏదుల రిజర్వాయర్ అప్పర్ డిండికి నీటిని తరలించే బదులు 430 మీటర్ల ఎత్తు వద్దే రిజర్వాయర్ నిర్మించి అక్కడ్నుంచి నీటిని తరలించేలా డిజైన్‌ను ఖరారు చేశారు. ఇలా అయితే టన్నెల్ అవసరం ఉండదని ఇంజనీర్లు చెబుతున్నారు. 430 మీటర్ల ఎత్తు వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేపడితే కొత్తగా ఇర్విన్ వద్ద 4.5 టీఎంసీలు, జేపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యం రిజర్వాయర్ నిర్మించా ల్సి ఉంటుంది. అలాగే కిష్టరాంపల్లి సామర్థ్యం 5.7 నుంచి 9 టీఎంసీలు, శివన్నగూడెం సామర్థ్యాన్ని 7 నుంచి 10 టీఎంసీలకు పెంచాల్సి ఉంటుంది. -
పెన్‌గంగలో మహిళ మృతదేహం
జైనత్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం డొల్లార గ్రామ సమీపంలోని పెన్‌గంగ నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకు వచ్చింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సుమారు మహిళ 40 సంవత్సరాల వరకు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.