ఏప్రిల్ తొలివారంలో తెలంగాణ-మహారాష్ట్ర
సీఎంల స్థాయిలో సమావేశం
సాక్షి, హైదరాబాద్: గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై నిర్మించే మూడు బ్యారేజీల పనులను తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండే అంతర్రాష్ట్ర బోర్డు ఆమోదం తర్వాతే చేపట్టనున్నారు. అప్పటివరకు ప్రాజెక్టుల పరిధిలో చిన్నపాటి మా ర్పులు, అవసరమైన అనుమతులు, చేయాల్సిన సర్వేలను పూర్తిచేసుకోనున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల అధికారుల స్థాయిలో జరిగిన కమిటీ సమావేశాల్లో నిర్ణయించినట్లు తెలిసింది. ప్రాణహితపై నిర్మించే తమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో, మేడిగడ్డ బ్యారేజీని 100 మీటర్ల కనీస ఎత్తుతో నిర్మించేందుకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం ఇప్పటికే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి మార్గంలో నిర్మించే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి వ్యయ అంచనాలు సిద్ధం చేసి పెట్టుకుంది. వాటికి పరిపాలనా అనుమతులు ఇచ్చేసి పనులు మొదలుపెట్టాలని భావించింది. ఈ పాటికే టెండర్ల ప్రక్రియను సైతం ముగించాలని భావించినా... అంతర్రాష్ట్ర చర్చల నేపథ్యంలో వాటిని నిలిపివేశారు. అయితే అధికారుల స్థాయి చర్చల అనంతరం పనులు మొదలు పెట్టేందుకు అవకాశం ఉంటుందని అంతా భావించినా... భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కా రం ఇవ్వకుండా బోర్డు ఆమోదం తర్వాతే పనులు మొదలుపెట్టాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఏప్రిల్ తొలివారంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఆ రాష్ట్ర జల వనరుల మంత్రి గిరీశ్ మహాజన్ రాష్ట్రానికి వచ్చే అవకాశముంది.
బోర్డు ఆమోదం తర్వాతే బ్యారేజీల పనులు
Published Mon, Mar 21 2016 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM
Advertisement