మున్సిపల్ కార్యాలయం
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికలను ఆగస్టు మాసంలో నిర్వహిస్తామని వాటికి సంబంధించిన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని గతంలో ప్రకటించడంతో ఆ దిశగా మున్సిపల్ అధికారులు ఏ ర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. అధికారులు వార్డుల విభజన పూర్తి చేసి వార్డులు, కులాల వారీగా ఓటర్ల తు ది జాబితాను విడుదల చేసిన విష యం తెలిసిందే. ఎన్నికల నిర్వహణ కోసం మున్సిపల్ అధికారులు పోలింగ్ కేంద్రాలను సైతం గుర్తించారు. ఎన్నికలసంబంధించిన అధికారులను నియమించారు. వారికి శిక్షణను సైతం అందజేశారు. ప్రధానంగా జోనల్, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టిక్ సర్వేలైన్ బృందాలు, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల నియమాకాన్ని చేపట్టారు.
మరోసారి విచారణ వాయిదా..
రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటీలో వార్డుల విభజన, ఓటర్ల జాబితా గందరగోళంగా ఉందంటూ హైకోర్టుకు వెళ్లినా విషయం తెలిసిందే. ఆయా అంశాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి న్యాయ స్థానం ప్రభుత్వానికి పలుసార్లు గడువు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలపై దాఖాలైన వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్డులో విచారణ సాగింది. కొత్త పురపాలక చట్టం వివరాలను రాష్ట్ర ప్రభుత్వం న్యాయ స్థానానికి సమర్పించింది. పాత చట్టం ప్రకారమే ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని నివేదించింది. వార్డుల విభజన గందరగోళం, తదితర అంశాలపై అభ్యంతరాలు చెప్పినప్పటికీ వాటిని పరిష్కరించలేదని పిటిషనర్లు వాదించగా, అభ్యంతరాలన్ని ఒక్కరోజులో పరిష్కరించడం సాధ్యం కాదని హైకోర్టు అభిప్రాయ పడింది. విచారణలో భాగంగా కౌంటర్‌లో పేర్కొన్న అంశాలపై పూర్తి ఆధారాలను ఈనెల 20లోపు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇదివరకే పలుమార్లు విచారణను వాయిదా వేసిన హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టి తదుపరి విచారణను 21వ తేదికి వాయిదా వేసింది.
కొనసాగుతున్న ఏర్పాట్లు
మున్సిపాలిటీ ఎన్నికలకు ఓవైపు అంతా సిద్ధమవుతుంటే మరోవైపు సందిగ్ధం నెలకొంది. ఎన్నికలు జరుగుతాయో.. లేదోననేది వివిధ పార్టీల్లో ఆశావహులే కాకుండా అధికారుల్లో సైతం అయోమయం నెలకొంది. అధికార యంత్రాంగం తన పనితాను చేసుకుంటూ ముందుకెళ్తోంది. ముందస్తుగా అన్నిసిద్ధం చేసేందుకు కార్యాచరణను రోజువారీగా రూపొందించుకుంటున్నారు. ఇదివరకే అధికారులు చేపట్టిన పనులు, తదితర వాటిపై వివరాలు తీసుకున్నారు. ఎన్నికల అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి మున్సిపల్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ హాజరై పలు సూచనలు సైతం అందజేశారు.
అందరిలో ఉత్కంఠ..
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గతంలో 36వార్డులు ఉండగా, విలీనమైన గ్రామపంచాయతీలతో ఆ వార్డు సంఖ్య 49కు చేరింది. ఇటీవల ముగిసిన మున్సిపాలిటీ పాలకవర్గం గడువు నుంచి ఆశావహులు ఆయా వార్డుల్లో పోటీ చేసేందుకు ముందస్తుగానే అంచనాలను వేసుకుంటున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణపై ఇదివరకే ఆదిలాబాద్ మున్సిపాలిటీ నుంచి కాకుండా ఇతర జిల్లా నుంచి హైకోర్టులో వ్యాజ్యాలు వేయడంతో పలుమార్లు హైకోర్టు ఆ అంశాలపై విచారణ చేపట్టింది. దీంతో ఆశావహులు మరింత ఉత్కంఠకు గురవుతున్నారు.
వార్డుల్లో కలియ తిరుగుతూ..
పోటీ చేసే ఆశావహులు నెలరోజుల నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకవేళ రిజర్వేషన్ కలిసివస్తే తమకు మద్దతు పలకాలని వార్డుల్లో కలియతిరుగుతూ వేడుకుంటున్నారు. ఆయా వార్డుల్లో ఓటర్లను ఇప్పటినుంచే మచ్చిక చేసుకుంటున్నారు. విందులు ఇస్తూ వారిని దగ్గర చేసుకుంటున్నారు. ఎన్నికల మహాత్యమేమో కానీ అర్ధరాత్రికి ఫోన్ చేసినా స్పందిస్తూ కాలనీలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment