సెలవుల్లో ఇంటికి వచ్చినా ఆనందం కరువు | Bhainsa People Fear on Assault on Homes And Vehicles | Sakshi
Sakshi News home page

ఎప్పుడేం జరుగుతుందో..?

Published Tue, Jan 14 2020 12:14 PM | Last Updated on Tue, Jan 14 2020 3:02 PM

Bhainsa People Fear on Assault on Homes And Vehicles - Sakshi

భయాందోళనలో స్థానికులు

భైంసా/భైంసాటౌన్‌: పండుగపూట భైంసా పట్టణంలో ప్రశాంతత కరువైంది. ఆదివారం సరదాగా సెలవుల్లో వచ్చిన పిల్లలతో కలిసి భైంసాలోని థియేటర్‌కు వెళ్లి సెకండ్‌షో సినిమా చూసిన చాలా కుటుంబాలు బయట జరగుతున్న వాతావరణం చూసి భీతిల్లిపోయారు. సరదా కోసం వెళ్లిన సినిమా చూసి ఇళ్లకు చేరుకునే లోపే భయం వెంటాడింది. ఇళ్లకు చేరుకున్న ఈ కుటుంబాలు రాత్రి భోజనాలు కూడా చేయలేదు. భైంసా పట్టణమంతా అల్లరి మూకల అరుపులు, కేకలు పోలీసు పెట్రోలింగ్‌ వాహనాల చప్పుళ్లతో హోరెత్తితింది. ఎటు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. రాత్రి సమయంలో అల్లరిమూకల చేతిలో గాయాలపాలైన వారిని పరుగుపరుగునా ఆస్పత్రుల్లో చేర్పించడం.. చికిత్స అందించడం మళ్లీ ఇంట్లో ఉన్న తమవారికి ఏం జరుగుతుందోనని తెలియక అయోమయానికి లోనవుతూనే కనిపించారు. సోమవారం తెల్లవారేసరికి భైంసాలో ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రభుత్వం మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి భైంసాలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా పోయింది. భైంసాలో ఉన్న తమవారి బాగోగులు తెలుసుకునేందుకు చుట్టు పక్కల గ్రామాల వారు నానా తంటాలు పడ్డారు. ఇక మీడియాలోనూ ఏం వస్తుందోనని తెలుసుకుందామని వెళ్లినా ఆంక్షలతో అక్కడా ఏ సమాచారం తెలియకుండా పోయింది. రాత్రి అవుతున్న కొద్ది మళ్లీ భైంసాలో ఏం జరుగుతుందోనన్న భయం భైంసావాసుల్లో కనిపించింది.

కుటుంబంలో ఉన్న పిల్లలను పడుకోబెట్టి పెద్దలంతా కిటికీల వద్ద, ప్రధాన ద్వారాల వద్ద కాపలా కాస్తూ ఉండిపోయారు. కార్లు, ఖరీదైన వాహనాలు ఉన్నవారు వాటిని భద్రంగా దాచుకునేందుకు తంటాలు పడ్డారు. భైంసా పట్టణంలోని ప్రైవేట్‌ పాఠశాలలలు, కళాశాలల బస్సులన్నీ భద్రత కోసం ఇతర ప్రాంతాలకు తరలించారు. ద్విచక్ర వాహనాలను ఇళ్లలోకి తీసుకెళ్లి భద్రపరిచారు. ఇలా భోగి సంక్రాంతి పండుగలకు ముందే భైంసాలో భయానక వాతావరణం నెలకొంది. పండుగ సమయంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. సెలవుల్లో సరదాగా గడుపుదామనుకున్న పిల్లలకు కళ్ల ముందే జరిగిన సంఘటనలు చూసి భయాందోళనకు గురవుతున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే : ఎంపీ సోయం
మున్సిపల్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే భైంసాలో పథకం ప్రకారమే ఓ వర్గంవారు దాడులకు పాల్పడ్డారని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. సోమవారం ఉదయం భైంసాకు చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రాత్రంతా ఒక వర్గంపై మరో వర్గంవారు రాళ్లు, గాజుసీసాలతో దాడి చేసినా పోలీసులు అడ్డుకోలేకపోయారని, ఘర్షణకు కారకులైన ఏ ఒక్కరినీ ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆరోపించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు. పట్టణంలో కర్ఫ్యూ విధించి, శాంతిభద్రతలను అదుపులోకి తేవాలన్నారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ.. భైంసాలో దాడులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దాడుల్లో నష్టపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఇళ్లు ధ్వంసమైన వారికి పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ఎన్నికలు నిలిపేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి అల్జాపూర్‌ శ్రీనివాస్, విష్ణుప్రకాశ్‌బజాజ్, రవిపాండే, నారాయణ్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement