నిరాశ్రయులకు షెల్టర్ల నిర్మాణంలో అంతులేని జాప్యం.. ఆదిలాబాద్‌లోని ప్రధాన మార్కెట్ దారిలో డివైడర్‌పై కర్రలు, గోనె సంచుల సహాయంతో గుడిసెను ఏర్పాటు చేసుకున్న యాచకురాలు.. ఎదురుగా భిక్షాటన చేస్తున్న దృశ్యం..
ఆదిలాబాద్ నుంచి గొడిశెల కృష్ణకాంత్‌గౌడ్ :
నిరాశ్రయులు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ.. కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారికి ఆశ్ర యం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ‘జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్’ (నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్) కింద నిధులు మంజూరు చేస్తుంది. ప్రధానంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆస్పత్రుల సమీపంలో స్థలాలను గుర్తించి అక్కడ ఆశ్రయం కోసం శాశ్వత భవనా లను నిర్మించడం పథకం ఉద్దేశం. ఈ పథకం కింద పలుచోట్ల ఇప్పటికే తాత్కాలిక షెల్టర్లు కొనసాగుతున్నాయి. నగరాల్లో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా వీటిని నిర్మిస్తున్నారు.
ఆశ్రయాల్లో సౌకర్యాలూ ఉండాలి...
ఆశ్రయాల్లో తాగునీరు, టాయిలెట్స్, బెడ్లు, మెడికల్ వసతి కల్పించాల్సి ఉంది. పలు పట్టణాల్లో నిరాశ్రయులను గుర్తిం చినప్పటికీ షెల్టర్లు, శాశ్వత భవన నిర్మాణాలను చేపట్టలేదు. స్థల ఎంపిక కూడా దీనికి సమస్యగా మారుతోంది.
నిరాశ్రయులంటే యాచకులు మాత్రమే కాదు..
నిరాశ్రయులంటే కేవలం యాచకులనే అపోహ ఉంది. కానీ ఇళ్లు లేని అనేక మంది పొద్దంతా పనిచేసి సాయంత్రం అరుగులపై, రోడ్ల పక్కన చిన్నచిన్న గుడిసెలు వేసుకుని జీవిస్తుంటారు. రిక్షాలు, ఆటోలు నడిపేవారు సైతం ఇల్లు దూరప్రాంతంలో ఉంటే రెండు రోజులకు ఓసారి వెళ్లి వస్తుంటారు. అలాంటి వారు సైతం రోడ్డు పక్కనే పడుకుంటుంటారు. పల్లె విడిచి పట్టణానికి వలస వెళ్లిన కార్మికులు ఎందరో సరైన పడుకునే వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. వివిధ కారణాలతో కుటుంబ సభ్యులను వదిలి వచ్చిన వారు, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు బానిసలైన వారు కూడా రోడ్డుపక్కనే పడుకుని ఉంటారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆశ్రయాల నిర్మాణానికి ముందుకొచ్చి నిధులు మంజూరు చేస్తోంది.
ఇక్కడ గుర్తింపునకే పరిమితం..
కొత్తగూడెంలో 103, మంచిర్యాల 79, ఆదిలాబాద్ 79, వేములవాడ 60, నిర్మల్ 49, కామారెడ్డి 40, భువనగిరి 55, భైంసా 48, ఆర్మూర్‌లో 43 మంది నిరాశ్రయులను గుర్తించారు. మిగతా పట్టణాల్లోనూ స్వల్ప సంఖ్యలో నిరాశ్రయులు ఉన్నారు.