నేరస్తుడికి మోదీ ప్రచారం తగదు: శివసేన
సాక్షి, ముంబై: అహ్మద్‌నగర్ జిల్లాలో గురువారం జరుగనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రచారసభలో నల్లజెండాలు చూపించేందుకు శివసేన సిద్ధమవుతోంది. అహ్మద్‌నగర్ జిల్లాలోని రాహురీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న శివాజీ కార్డిలే గతంలో ఒక కేసు విషయంలో ఏడాది కఠిన కారాగార శిక్ష, మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించారు. కాగా, ప్రస్తుత ఎన్నికల్లో ఆయన నిలుచున్న నియోజకవర్గంలో జరుగనున్న పార్టీ ప్రచారసభలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు.
దీనిపై శివసేన తీవ్రంగా మండిపడింది. ఈ విషయమై తమ నిరసనను వ్యక్తం చేస్తూ స్థానిక శివసేన యువనాయకుడు కేశవ్ అలియాస్ రాజేంద్ర షిండే ప్రధాని కార్యాలయానికి ఒక లేఖను కూడా పంపించారు. జైలు శిక్షపడిన వ్యక్తి కోసం దేశ ప్రధాని ప్రచారం చేయడం సబబుకాదని పేర్కొంటూ రాహురి ప్రచారసభలో పాల్గొనవద్దని కోరారు. లేదంటే తాము ప్రధాని నరేంద్ర మోదీకి నల్లజెండాలు చూపించి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.