క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సభ్యులను నియమించాలి
రైల్వే ప్రమాద బాధిత కుటుంబాల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రమాదాల్లో గాయపడిన, చనిపోయిన కుటుంబాలు పరిహారానికి దాఖలు చేసుకునే పిటిషన్లను విచారించే రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో ఖాళీగా ఉన్న సభ్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు బాధితులు మంగళవారం సికింద్రాబాద్ సమీపంలోని ట్రిబ్యునల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దాదాపు 4 వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని, ట్రిబ్యునల్‌లో సభ్యులు లేని కారణంగా విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతోందని, దీంతో నష్ట పరిహారం అందక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.
పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యంపై ట్రిబ్యునల్‌లో పిటిషన్లు దాఖలు చేసినా సభ్యులు లేకపోవడంతో విచారించే పరిస్థితి లేదన్నారు. చైర్మన్ పదవి కూడా ఖాళీగా ఉండటంతో సభ్యులను నియమించే దిక్కు లేకుండా పోయిం దన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఎం.పాండురంగారావు, కృష్ణమోహన్‌రావు, గిరికుమార్, గీతామాధురి, ద్వారకానాథ్ పట్నాయక్‌లు పాల్గొన్నారు.