హైదరాబాద్లో వర్ష బీభత్సం
హైదరాబాద్ : భాగ్యనగరాన్ని అర్ధరాత్రి భారీ వర్షం కుదిపేసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో నగరం బెంబేలెత్తింది. ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. అర్ధరాత్రి ఒక్కసారిగా వర్షం ముంచెత్తటంతో జంటనగరాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి విద్యుత్ సరఫరాకు నిలిచిపోయింది. పవర్ కట్తో నగరమంతా చీకటిమయమైంది.
ఇక వరద నీటితో జంటనగరాల రోడ్లు కాలువల్ని తలపించాయి. నాలాలు పొంగిపొర్లాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, కోఠి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎర్రగడ్డ, కూకట్పల్లి, బీరంగూడ, మియాపూర్ గచ్చిబౌలిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్లోనూ వర్షం బీభత్సం సృష్టించింది. రామంతాపూర్, మోహదీపట్నం, రాజేంద్రనగర్లోనూ భారీ వర్షం కురిసింది.
ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి అసలు చెప్పనక్కర్లేదు. ఎల్బీనగర్ గుంటి జంగయ్యకాలనీని వర్షపు నీరు ముంచెత్తింది. ఇళ్లలో మోకాలులతోతు నీళ్లు చేరడంతో వస్తువులన్నీ మునిగిపోయాయి. వర్షం మొదలైనప్పటి నుంచి కంటిమీద కునుకు లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న... తమకు ఈ కష్టాలు తీరడంలేదంటున్నారు.
అలాగే పాతబస్తీ ఉప్పుగూడ కాళీనగర్లో వర్షపునీరు ఇళ్లలోకి చేరింది. పలు చోట్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాల దగ్గర వున్న భారీ వృక్షాలు.. వర్షాలకు నేలమట్టం అయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని నేలకూలిన వృక్షాలను తొలగించే పనిలో ఉన్నారు.