తేల్చుతారా?
= విశాఖ వచ్చిన కేంద్ర బృందం
= పంట నష్టం పరిశీలనకు నేడు జిల్లాలో పర్యటన
=నేటితో పూర్తికానున్నా అధికారుల అంచనాలు
= ప్రభుత్వ ఆంక్షలతో ఆందోళనలో రైతన్నలు
కష్టాలతో, కడగండ్లతో బతుకు నెట్టుకొస్తున్న అన్నదాతకు ఆపాటి ఊరటైనా ఎందుకు మిగల్చాలనుకుందేమో.. గత నెల ప్రకృతి పల్లెల్లో విలయతాండవం చేసింది. పొలాల్లోనే కాదు.. ఇళ్లలో సైతం కన్నీటి గంగా ప్రవాహాన్ని సృష్టించింది. ఆరుగాలం శ్రమించిన రైతన్న కష్టాన్ని ఎగరేసుకు పోయింది. వీధుల్లో ఉప్పొంగిన వరద అందరినీ బెంబేలెత్తించింది. అయితే ఇంత కష్టంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మరోవైపున వరదలు వచ్చిన మూడు వారాల తరువాత నష్టం పరిశీలనకు కేంద్ర బృందం సోమవారం విశాఖకు వచ్చింది. నేడు గ్రామీణ జిల్లాలో పర్యటించనుంది. ఈసారైనా రైతాంగానికి న్యాయం జరుగుతుందా? కళ్లముందే నష్టం కనిపిస్తున్నా.. నివేదికల్లో మాత్రం కుదించుకుపోతుందా? అన్న సందేహం అన్నదాతను మళ్లీ వెంటాడుతోంది.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: భారీ వర్షం బీభత్సం సృష్టిం చింది. గత నెలలో కురిసిన వర్షం అన్నదాత జ్ఞాపకాల్లో పీడకలగా మిగిలిపోతుంది. 21 నుంచి 27వ తేదీ వరకు ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల పంట నీట మునిగింది. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం.. 17,855 హెక్టార్లలో వరి, 6079 హెక్టార్లలో చెరకు, 1212 హెక్టార్లలో పత్తి, 143 హెక్టార్లలో జొన్న, 653 హెక్టార్లలో రాజ్మా, 255 హెక్టార్లలో పొగాకు, 70 హెక్టార్లలో వేరుశెనగ, 813 హెక్టార్లలో రాగి, 155 హెక్టార్లలో పెసలు, 50 హెక్టార్లలో కంది... ఇలా మొత్తంగా 27,285 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. రూ.54.57 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. కూరగాయలు 811 హెక్టార్లలో, తమలపాకు 135, పువ్వులు 101, అరటి 20, బొప్పాయి 65 హెక్టార్లలో దెబ్బ తిన్నాయి. రూ. 5.05 కోట్లు నష్టం జరిగింది.
కేంద్ర బృందం పర్యటన: అధికారులు ప్రాథమిక అంచనా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. దాన్ని ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. ఆ నివేదిక ప్రకారం నష్ట తీవ్రతను స్వయంగా పరిశీలించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం సోమవారం సాయంత్రం విశాఖకు చేరుకుంది. అధికారుల నివేదిక ప్రకారం అనకాపల్లి, యల మంచిలి నియోజకవర్గాల్లో ఈ బృందం పర్యటించనుంది. అనకాపల్లిలో ఆవఖండం, రాంబిల్లి మండలంలో పంచదార, నారాయణపురం గ్రామాల్లో పంట నష్టంతో పాటు గట్లకు పడిన గండ్లను స్వయంగా పరిశీలించనుంది.
అలాగే యల మంచిలిలో దెబ్బతిన్న ఇళ్లను కూడా సందర్శించనుంది. ఇదిలా ఉంటే వరదలు తగ్గిన మూడు వారాలకు జిల్లాలో పం ట నష్టం అంచనాల జాబితా తుది దశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రంతో తుది జాబితా కలెక్టర్‌కు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర బృందం అధికారులు తయారు చేసిన జాబితాను కూడా పరిశీలించే అవకాశముంది. దాని ప్రకారం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అనంతరం కేంద్ర బృందం ఒక జాబితాను కేంద్ర ప్రభుత్వానికి స మర్పిస్తుంది. జిల్లా అధికారులు, కేంద్ర బృందం ఇచ్చిన నివేదికలు ఆధారంగా కేంద్రం పరిహారం మంజూరు చేయనుంది.
ఈసారైనా న్యాయం జరిగేనా?
అధికారుల నష్టం అంచనాల నివేదికపై రైతన్నల్లో ఆందోళన నెలకొంది. 2012 నవంబర్ మొదటి వారంలో వచ్చిన తుఫాన్ కారణంగా జిల్లాలో 80,915 ఎకరాల్లో పంటలు నీటమునగడంతో 1,45,487 మంది రైతులు నష్టపోయారు. రూ.97.8 కోట్లు నష్టం వాటిల్లగా.. పెట్టుబడి రాయితీ కోసం కేవలం రూ.30.24 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. అవి ఇప్పటికీ పూర్తి స్థాయిలో మంజూరు కాలేదు. ఇంకా రూ.7 కోట్లు విడుదల కావాల్సి ఉంది. 50 శాతం కంటే అధికంగా పంట నష్టపోతేనే పరిగణలోకి తీసుకోవాలన్న ప్రభుత్వ నిబంధన కారణంగా ఈసారి కూడా అన్యాయమే జరుగుతుందన్న భయం రైతుల్లో అలుముకుంది. ఈసారి ఏ వి దంగా నష్టం నివేదికలు తయారు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల్లోనే నష్టం అంచనాలు జాబి తాను అధికారులు ప్రభుత్వానికి పంపించే అకాశముంది.
బృందం సభ్యులు..
జిల్లాలో పైలీన్ తుఫాన్ వల్ల, భారీ వర్షాల వల్ల జరిగి న నష్టాన్ని పరిశీలించడానికి ఢిల్లీ నుంచి ముగ్గురు సభ్యుల బృందం విశాఖ చేరుకుంది. క్వాలిటీ కంట్రో ల్ (రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్) ఎస్ఈ కార్యాలయం లో రీజినల్ ఆఫీసర్ ఎ.కృష్ణప్రసాద్, ఫైనాన్స్, డిపార్టుమెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ జాయిం ట్ డెరైక్టర్ డాక్టర్ పి.జి.ఎస్.రావు, డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ అసిస్టెంట్ అడ్వైజర్ వి.కె.బాట్ల బృందంలో సభ్యులు.
పర్యటన ఇలా..
కేంద్ర బృంద సభ్యులు మంగళవారం ఉదయం 10.10కి అనకాపల్లి బయలుదేరుతారు. ఆవఖండం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. 10.50కి రాంబిల్లి మండలంలో పంచదార్ల, నారాయణపురం గ్రామాల్లో పంటలను, వరదలకు పడిన గండ్లను, అలాగే 11.30కి యలమంచిలిలో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.40కి ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. 1.30కి ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళతారు.
ఇదీ నష్టం..
గత నెల 21 నుంచి 27వ తేదీ వరకు ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం.. 17,855 హెక్టార్లలో వరి, 6079 హెక్టార్లలో చెరకు, 1212 హెక్టార్లలో పత్తి ప్రధానంగా దెబ్బ తిన్నాయి. మొత్తం మీద 27,285 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా రూ.54.57 కోట్లు నష్టం వాటిల్లింది.