raj bhawan
-
స్టాలిన్ చర్యలపై ఆగ్రహం
సాక్షి, చెన్నై: ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌పై గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. జిల్లాల్లో ఆయన పర్యటనకు వ్యతిరేకంగా డీఎంకే పార్టీ నిరసన ప్రదర్శనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పర్యటనను అడ్డుకోవాలని యత్నిస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ప్రతిపక్షానికి గవర్నర్ హెచ్చరికలు జారీచేశారు. ‘గవర్నర్‌కు కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. వాటిననుసరించి ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే హక్కు ఉంటుంది. కాదని ఎవరైనా విఘాతం కలిగించాలని యత్నిస్తే వాళ్లు జైలుకు వెళ్లాల్సిందే. ఐపీసీ సెక్షన్ 124 ప్రకారం గవర్నర్ కార్యకలాపాలను అడ్డుకునేవారిపై కేసు నమోదుచేసి, ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంది’ అంటూ రాజ్‌భవన్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే బాధ్యతలు స్వీకరించిన వెంటనే జిల్లాలు పర్యటిస్తున్న గవర్నర్ భన్వరిలాల్.. ప్రభుత్వ కార్యాలయాల సందర్శించి అక్కడి కార్యాకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష డీఎంకే తీవ్ర ఆగ్రహం వెల్లగక్కుతోంది. ‘రాజ్‌భవన్ మరో సచివాలయంగా మారిందని, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ఓ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారంటూ’ అని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ విమర్శించారు. రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ, రాష్ట్ర ప్రయోజనాల్ని తుంగలో తొక్కే రీతిలో వ్యవహరిస్తున్న ఆయన్ను తప్పించాల్సిందేనని డిమాండ్ వినిపిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా గవర్నర్ ఏ మాత్రం తగ్గడం లేదు. విమర్శలు, ఆరోపణలు, ఆందోళనల్ని ఖాతరు చేయకుండా తన దారిలో ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం గవర్నర్ నామక్కల్ పర్యటన సందర్భంగా డీఎంకే నల్ల జెండాల ప్రదర్శన వివాదానికి దారితీయగా, పలువురు నేతలను అరెస్ట్ చేశారు. తాజాగా రాజ్‌భవన్ హెచ్చరికలతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. -
కర్ణాటక రాజ్‌భవన్ వద్ద మారిన సీన్
సాక్షి, బెంగళూరు: గార్డెన్ సిటీ నడిమధ్యలోని గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్ వద్ద పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో.. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా నిర్ణయం కీలకంగా మారింది. అటు కాంగ్రెస్-జేడీయూల కూటమి, ఇటు బీజేపీ.. ఇద్దరూ గవర్నర్ అపాయింట్మెంట్ను కోరారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప డిమాండ్ చేయగా... ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉన్నందున తమనే పిలవాలని కాంగ్రెస్-జేడీయూ నేతలు కోరుతున్నారు. ఈ పరస్పర విరుద్ధప్రకటనల నేపథ్యంలో రాజ్‌భవన్ వద్ద కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం దాకా రాజ్‌భవన్ వద్ద సాధారణపరిస్థితులే ఉన్నా.. సాయంత్రానికి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇరు వర్గాల అభ్యర్థనలను పరిశీలించిన తర్వాత గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఉత్కంఠనెలకొంది. సిద్దరామయ్య రాజీనామా చేయడానికి వెళ్లినప్పుడు కూడా ఆయన కారును మాత్రమే లోనికి అనుమతించి, మిగతావాటిని రాజ్‌భవన్ గేటు బయటే నిలిపేయడం గమనార్హం. -
క్యాష్‌లెస్‌గా గోవా రాజ్‌భవన్
పనాజీ: గోవా రాజ్‌భవన్ పూర్తిగా నగదు రహితమైంది. సోమవారం దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకుంది. దీంతో ఈ కార్యక్రమం సందర్భంగా గవర్నర్ మృదుల సిన్హా తొలి నగదు రహిత లావాదేవీని చేశారు. ‘గోవా గవర్నర్ మృదుల సిన్హా సోమవారం దోనా పౌలాలోని రాజ్‌భవన్ ఇక నుంచి పూర్తిగా నగదు రహిత లావాదేవీలకు వెళుతోందని స్పష్టం చేశారు. భవన్ నిర్వహణ ఖర్చులు, పర్యటనల వ్యయాలు, తదితరుల ఖర్చులన్నీ కూడా నగదు రహిత లావాదేవీల ద్వారానే జరుగుతాయి' అని రాజ్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. -
యూపీ రాజ్‌భవన్ వద్ద కారుబాంబు పట్టివేత
ఉత్తరప్రదేశ్ గవర్నర్ నివాసమైన యూపీ రాజ్‌భవన్‌లోకి బాంబులతో ఉన్న కారు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న డ్రైవర్‌ను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఆ కారులో మూడు నాటుబాంబులు ఉన్నాయి. బంగ్లా గేటు వద్దే కారును పట్టుకున్నారు. శనివారం మధ్యాహ్నం యూపీలోని మోహన్‌లాల్ గంజ్ ప్రాంతానికి చెందిన రంజీత్ శర్మ అనే వ్యక్తి మహాత్మాగాంధీ మార్గ్‌లోని రాజ్‌భవన్ గేటు నెంబర్ 2 గుండా భద్రతావలయాన్ని దాటుకుని కారుతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది వెంటనే కారును ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేయగా వెనకసీటు వద్ద మూడు బాంబులు బయటపడ్డాయి. వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే కారును శుక్రవారం నాడు ఓ పెళ్లి బృందం వాళ్లు అద్దెకు తీసుకున్నారని, మందుగుండు సామగ్రి వదిలేసి ఉంటారని డ్రైవర్ అంటున్నాడు.