పులకించిన శైవ క్షేత్రాలు
వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. రాజన్న నామస్మరణంతో వేములవాడ క్షేత్రం పులకించిపోయింది. తొలుత స్వామికి మహాలింగార్చన నిర్వహిం చారు. స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, గురవరాజులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కలెక్టర్ కృష్ణభాస్కర్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు మూడు లక్షల మంది భక్తులు తరలివచ్చారని ఆలయ అధికారులు అంచనా వేశారు. ప్రముఖుల దర్శనాలు, ప్రత్యేక పూజల సందర్భంగా ఐదుసార్లు భక్తుల దర్శనానికి బ్రేక్‌లు పడ్డాయి.
మరోవైపు.. రాజన్న గుడిచెరువు ఖాళీ స్థలంలో భక్తులు జాగరణ ప్రారంభించారు. ఉపవాస దీక్షతో తెల్లవార్లూ జాగరణ చేశారు. భక్తులకు ఉత్సాహం ఇచ్చేలా భక్తితో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అలాగే, హన్మకొండలోని ప్రసిద్ధ వేయిస్తంభాల ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహాశివుడిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి సైతం శుక్రవారం ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ములుగు జిల్లా పాలంపేట రామప్ప రామలింగేశ్వరస్వామి దేవాలయం శివ నామస్మరణతో మారుమోగింది. రామప్ప దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివపార్వతుల కల్యాణం కనుల పండువగా జరిగింది. అలాగే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరాలయంలో మహా శివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి.