జీఎంఆర్ రాజమండ్రి విద్యుత్ యూనిట్ షురూ..
వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ గ్రూపు రాజమండ్రిలో ఏర్పాటు చేసిన 768 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ . 384 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన రెండు యూనిట్లను జీఎంఆర్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎనర్జీ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం గత మార్చిలో ప్రకటించిన ఆర్ఎల్ఎన్జీ స్కీం కింద గ్యాస్ సరఫరా జరగడంతో ఈ యూనిట్లు వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు జీఎంఆర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం స్థాపిత సామర్థ్యంలో 50 శాతం మాత్రమే (384 మెగావాట్లు) విద్యుత్ ఉత్పత్తి చేయడానికి గ్యాస్ సరఫరా అవుతోందని, ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ డిస్కంలకు విక్రయిస్తున్నట్లు తెలిపింది. కేంద్రం 2016 వరకు గ్యాస్ కేటాయింపులు జరిపిందని, ఆ తర్వాత గ్యాస్ కేటాయింపులకు కేంద్రం బిడ్డింగ్‌లను పిలుస్తుందని జీఎంఆర్ తెలిపింది. పక్కనే ఉన్న వేమగిరి యూనిట్‌కు కూడా గ్యాస్ కేటాయింపులు రావడంతో గత నెలలో ఈ యూనిట్ కూడా ఉత్పత్తిని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ రెండు యూనిట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1,156 మెగా వాట్లు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం కింద విద్యుత్ సరఫరా కంపెనీలకు విద్యుత్‌రంగ అభివృద్ధి నిధి నుంచి యూని ట్‌కు రూ. 1.44 సబ్సిడీ లభిస్తుంది.