రచ్చబండకు సమైక్య సెగ
రచ్చబండకు హాజరవుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సమైక్య సెగ తప్పడం లేదు. మంత్రి గల్లా అరుణకుమారికి శనివారం ఇదే అనుభవం ఎదురైంది. సమైక్య గళం వినిపించేందుకు యత్నించిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య మొక్కుబడిగా సభలు జరిగాయనిపించారు.
సాక్షి, చిత్తూరు: తిరుపతి రూరల్ మండలం రచ్చబండ సభ తిరుచానూరు శిల్పారామం వద్ద శనివారం నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. విషయం ముందే గ్రహించిన పోలీసులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మరికొందరు వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రజా సమస్యలపై అర్జీ ఇచ్చేందుకు వెళుతుంటే తమ కార్యకర్తలను పోలీసులు ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేశారని చెవిరెడ్డి విమర్శించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీ శివప్రసాద్ పాల్గొన్నారు.
లబ్ధిదారులకు పెన్షన్ తదితర పథకాలు పంపిణీ చేశారు. ప్రజా సమస్యల ప్రస్తావన లేకుండానే రచ్చబండ సభ ముగించేశారు. సభ కాంగ్రెస్ సమావేశంలా సాగుతోందని, గత రచ్చబండలో ఇచ్చిన అర్జీలు ఏమయ్యాయని సభలో సీపీఎం నాయకులు అధికారులను నిలదీశారు. రామచంద్రాపురంలోనూ ఇదే రీతిలో మొక్కుబడిగా రచ్చబండ సభ నిర్వహించారు. ఇక్కడ బంగారుతల్లి ప్రస్తావన లేకుండానే మంత్రి ఉపన్యసించి లబ్ధిదారులకు ఆస్తులు పంచారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య రచ్చబండ నిర్వహించారు.
చంద్రగిరిలో మంత్రిని అడ్డుకుని సమైక్యాంధ్ర నినాదాలు చేసేందుకు సిద్ధమైన పదిమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంద్రగిరి పోలీసులు రచ్చబండ జరగక ముందే అదుపులోకి తీసుకున్నారు. మంత్రి గల్లా అరుణ ఉపన్యసించి అర్జీలు తీసుకున్నారు. ఇక్కడా ప్రజలకు సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం కల్పించలేదు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ప్రభుత్వ పథకాలను ప్రస్తావించారు. అన్ని రచ్చబండ సభల్లో అర్జీలు తీసుకోవడం మినహా ప్రజలకు సమస్యలపై మా ట్లాడే అవకాశం అధికారులు ఇవ్వలేదు.
కాంగ్రెస్‌కు ఇదే చివరి రచ్చబండ
గ్రామ రచ్చబండలో జరగాల్సిన రచ్చబండను కల్యాణమండపాల్లో నిర్వహించడం సిగ్గుచేటు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాల్సిన అధికారులు ప్రజలనే తమవద్దకు రప్పించుకోవడం బాధా కరం. ప్రజాధనంతో నిర్వహించిన సభకు కాంగ్రెస్‌పార్టీ నాయకులను మాత్రమే అనుమతించడం అన్యాయం. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు గోరీకట్టడం ఖాయం. పోలీసులు చేతిలో ఉన్నారని ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడం మంచిదికాదు. అధికార పార్టీకి ఇదే చివరి రచ్చబండ. వచ్చే రచ్చబండ జగనన్న సారధ్యంలో వైఎస్ ఆశయాలతో జరుగుతుంది.
- చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త