అసభ్యతకు తావు లేకుండా...
‘ఊహలు గుసగుసలాడే’...అనే అచ్చ తెలుగు టైటిల్ వినగానే, మంచి ఫీల్ కలగడం ఖాయం. సినిమా కూడా ప్రేక్షకులకు మంచి అనుభూతినే కలగజేసింది. తాజాగా, ‘దిక్కులు చూడకు రామయ్య’ అంటూ వారాహి చలన చిత్రం పతాకంపై మరో అచ్చ తెలుగు టైటిల్‌తో సాయి కొర్రపాటి ఓ చిత్రం నిర్మిస్తున్నారు. అజయ్, నాగశౌర్య హీరోలుగా రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సనా మక్బూల్, ఇంద్రజ కథానాయికలుగా నటిస్తున్నారు.
యం.యం. కీరవాణి స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 19న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘అసభ్యతకు తావు లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కీరవాణిగారు స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పాత్రలన్నీ సహజంగా ఉంటాయి’’ అని చెప్పారు.