1500 మంది పిల్లలు అదృశ్యం
న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలో పిల్లలను ఒంటరిగా బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడి పోతున్నారు. బయటకు లేదా బడికి వెళ్లిన పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగొస్తారన్న నమ్మకం లేకుండా పోతోంది. రోజుకు 12 నుంచి 15 మంది పిల్లలు అదశ్యమవడమే అందుకు కారణం. ఇలా గత ఐదు నెలల కాలంలోనే 1500 మంది పిల్లలు అదశ్యమయ్యారని పోలీసుల రికార్డులు తెలియజేస్తున్నాయి. ఢిల్లీలో వీధి వీధిన సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసినా, హైటెక్ పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ పిల్లల కిడ్నాప్‌లకు తెరపడడం లేదు.
అదశ్యమైన పిల్లల్లో కేవలం 60 శాతం పిల్లలు మాత్రమే తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. వారిలో కూడా ఎక్కువ మంది తమంతట తామే కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని వస్తున్నారు. పాత ఢిల్లీ, అవుటర్ ఢిల్లీ ప్రాంతాల్లోనే ఎక్కువగా పిల్లల కిడ్నాప్‌లు జరుగుతున్నాయని డిప్యూటీ పోలీసు కమిషనర్ రాజన్ భగత్ తెలిపారు. 6 నుంచి 15 ఏళ్ల మధ్యనున్న పిల్లలు ఎక్కువగా అదశ్యమవుతున్నారు. ఢిల్లీ నగరానికి వలసవచ్చిన పేద ప్రజలే పిల్లలే కిడ్నాప్‌లకు ఎక్కువగా టార్గెట్ అవుతున్నారని, వారి తల్లిదండ్రుల వద్ద పిల్లల ఫొటోలు కూడా ఉండవని భగత్ తెలిపారు. పిల్లల కిడ్నాప్‌లను అదుపుచేసేందుకు ‘పెహచాన్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లు ఆయన వివరించారు.
కిడ్నాపైన పిల్లల్లో బాలలను ఎక్కువగా దేశంలోని పెద్ద నగరాలు, గల్ఫ్ దేశాలకు వెట్టి చాకిరి కోసం అమ్మేస్తున్నారని, బాలికలను వ్యభిచారంలోకి దించుతున్నారని పోలీసులు తెలిపారు. మారుమూల గ్రామాల్లో పెద్ద వయస్కులకు పెళ్లి చేయడానికి కూడా బాలికలను అమ్మేస్తున్నారని వారు చెప్పారు. అదశ్యమైన పిల్లల జాడను కనుగొనేందుకు తమ వంతు సహకారాన్ని అందించాలని సోషల్ మీడియాను, ఎన్జీవోలను పోలీసులు కోరుతున్నారు. తాము కూడా పెహచాన్ కార్యక్రమం కింద రోడ్లపై కనిపించే పిల్లల ఫొటోలనుతీసి భద్రపరుస్తున్నామని వారు చెప్పారు.