రాజన్న సేవలు మరింత ప్రియం?
►రెట్టింపు పెంపుదలకు ఆలయవర్గాల యోచన
►కమిషనర్ అనుమతులకోసం సిద్ధమైన ఫైలు
►నిధుల కోసమే భక్తులపై భారం
పేదల దేవుడు ఎములాడ రాజన్న ఆర్జిత సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఈ మేరకు ఆలయ వర్గాలు రంగం సిద్ధం చేశాయి. ప్రస్తుతమున్న పూజల టిక్కెట్ల ధరలు రెట్టింపు చేసే ప్రతిపాదన తయారు చేస్తున్నాయి. కమిషనర్ అనుమతులు కోరుతూ ఇప్పటికే సిద్ధం చేసిన ఫైలు కదిలేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయంలో వ్యతిరేకత తలెత్తకుండా ఉండేందుకు స్థానిక నేతలతో ఆలయ ఈవో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు భక్తులకు ఏదేని అభ్యంతరాలుంటే పక్షం రోజుల్లోగా వెల్లడించాలన్న షరతుతో కూడిన నోటీసులు సైతం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -వేములవాడ
భక్తులకు పెను భారం
పేదల పెన్నిధిగా పేరున్న రాజన్న భక్తులకు నానాటికీ దూరమవుతున్నాడు. ఆర్జిత సేవలు తరచూ పెంచుతుండడంతో ఆర్థిక స్తోమత లేనివారికి ఆయన సేవలు ప్రియమవుతున్నాయి. గతంలో నిరుపేదలకు అందుబాటులో ఉన్న రాజన్న సేవలు 2011లో అప్పటి ఈవో అప్పారావు హయాంలో రెట్టింపయ్యాయి. భక్తులపై ఏ మేరకు భారం పడుతోందన్నది పక్కన పెట్టిన ఆయన ఆలయ ఆదాయం ఎలా చెందుతుందన్నది మాత్రమే దేవాదాయ శాఖకు నివేదించి అనుమతులు పొందారని సమాచారం. ఇంతలోనే ఈ సారి రెట్టింపును మించిన అంచనాలతో పెంపుదలకు రంగం సిద్ధం చేశారు అధికారులు. రూ. 200 ఉన్న శ్రీఘ్ర కోడెమొక్కు చెల్లింపునకు ఏకంగా అతి శ్రీఘ్ర కోడెమొక్కుగా పేరు మార్చుతూ రూ. 1,000 కిపెంచేందుకు సిద్ధపడడం విడ్డూరంగా ఉంది.
నిధులు సమకూర్చుకునేందుకే..
రాష్ట్ర విభజన అనంతరం తలె త్తిన నిధుల కొరత భక్తులపాలిట శాపంగా మారిందా అంటే నిజమనే చెబుతున్నాయి ప్రస్తుతల పరిణామాలు. ఎందుకంటే ప్రధాన దేవాలయాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న కారణంగా తెలంగాణ దేవాలయాలకు కామన్గుడ్ఫండ్ భారీగా తగ్గిపోయింది. దీంతో ఈ నిధులను నమ్ముకుని తెలంగాణ దేవాలయాల్లో ఇప్పటికే చేపట్టిన రూ. 50 కోట్ల పనులు ముందుకు సాగడం ప్రశ్నార్థకంగా మారింది. విభజనకు పూర్వం రూ. 150 కోట్లమేర కామన్ గుడ్ఫండ్ సమకూరేది.
ఇందులో తెలంగాణ ఆలయాలకూ వాటా దక్కింది. ప్రస్తుతం తెలంగాణ దేవాలయాల ద్వారా కేవలం రూ. 7.50 కోట్లుమాత్రమే కామన్గుడ్ఫండ్ సమకూరనుంది. దీంతో రాజన్న ఆలయానికి సైతం అభివృద్ధి నిధులు అంతంతమాత్రంగానే కేటాయించే అవకాశముంది. ఈ దరిమిలా నిధులు భారీగా జమ గట్టేందుకే ఈ తరహా పెంపుదల భారం తప్పడం లేదన్నది తెలుస్తోంది. ఈ వాదనను బలపరుస్తూ పెంపుదల నోటీసుల్లో అభివృద్ధి పనులు అంతరాయం లేకుండా సాగించేందుకు టికెట్ల రేటు పెంపుదల చేస్తున్నట్లు పేర్కొనాలని చూస్తున్నట్లు సమాచారం.