గోశాలను సందర్శించిన అధికారులు
కోడెల రక్తనమూనాల సేకరణ
మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : ఈవో
వేములవాడ : వేములవాడ రాజన్న గోశాలను అధికారులు సందర్శించారు. కోడెలకు పౌష్టికాహారం అందించడంతోపాటు మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు. రాజన్నకు భక్తులు సమర్పించుకునే కోడెలు మృత్యువాత పడుతుండటంతో ‘రాజన్న కోడెల మృత్యుఘోష’ శీర్షికన ఈనెల 23న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. స్పందించిన ఈవో దూస రాజేశ్వర్ అధికారులతో కలిసి మంగళవారం గోశాలలను సందర్శించారు. కోడెలకు రక్షణ, పౌష్టికాహారం విషయంలో రాజీ పడబోమని, మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. పశువైద్యాధికారులతో రక్తనమూనాలు సేకరించారు. కోడెలు మృత్యువాతపడకుండా చర్యలు తీసుకోవాలని గోశాల నిర్వాహకులను ఆదేశించారు. అనారోగ్యంతో కనిపించిన కోడెలకు సత్వరమే వైద్యం చేయించాలనీ, లేకుంటే మరో ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు.
మరో కోడె మృతి
వేములవాడ రూరల్ : రాజన్న గోశాలను అధికారులు పరిశీలించి.. మెరుగైన వైద్యం అందిస్తామని పేర్కొన్న రోజే మరో కోడె మృతిచెందడం చర్చనీయాంశమైంది. కోడెల రక్షణకు తిప్పాపూర్‌లో ఏర్పాటు చేసిన గోశాలలో సిబ్బందితోపాటు, వెటర్నరీ డాక్టర్‌ను అధికారులు నియమించారు. 20రోజుల వ్యవధిలోనే ఐదు కోడెలు మృతిచెందగా.. మంగళవారం మరో కోడె మృత్యువాత పడింది.