అబ్బురపడేలా రాజన్న ఆలయం
సాక్షి, హైదరాబాద్: దేశం అబ్బురపడేలా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్‌లో వేములవాడ ఆలయ, పట్టణాభివృద్ధి పనులపై సమీక్ష జరిగింది. వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల పురోగతి, ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి ఆరా తీశారు.
దేశం అబ్బురపడేలా సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారని, వేములవాడ ఆలయాన్ని కూడా అదే రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి, పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. వీటీడీఏ, దేవాదాయ, పురపాలక, రోడ్లు, భవనాల శాఖ అధికారులు, స్తపతులను భాగస్వాములను చేసి వారి సలహాలు, సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వేములవాడ ఆలయ అభివృద్ధితో పాటు సమాంతరంగా పట్టణాభివృద్ధి జరగాలని సూచించారు. వేములవాడ ఆలయానికి వచ్చే భక్తులతో పాటు పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా పుష్కరిణి, కల్యాణకట్ట, కల్యాణ మండపం, క్యూ కాంప్లెక్స్, కళాభవనం పనుల్లో వేగం పెరగాలని చెప్పారు.
టెంపుల్ టూరిజంగా వేములవాడ
దేవాలయ పర్యాటకంలో భాగంగా వేములవాడను సమగ్ర అభివృద్ధి చేయాలని, చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్ నిర్మించాలని, బోటింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేములవాడ, మిడ్‌మానేరులో పర్యాటక రంగాన్ని మెరుగుపరిచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టాలని, స్థల సేకరణ వెంటనే చేపట్టాలని, విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. వేములవాడలో దశల వారీగా రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టాలని, బ్రిడ్జి నుంచి గుడి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. బస్టాండ్ నుంచి ఆలయం వరకు ఉచిత ప్రయాణం కల్పించాలని, దానికి అనుగుణంగా మినీ ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.