నేతలకు ఉద్యోగాల వల!
సాక్షి, హైదరాబాద్: అతడో ఘరానా మోసగాడు... రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ యువకిరణాలు ప్రాజెక్టుల్లో ఉద్యోగాల పేరు చెప్పి ఇప్పటి వరకు 22 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు టోకరా వేశాడు. మరో ముగ్గురు పార్లమెంట్ సభ్యులకు టోపీ పెట్టి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు తాజాగా చిక్కాడు. ఘరానా మోసగాడు తోట బాలాజీనాయుడు(34) చరిత్ర ఇదీ! నిందితుడు ఇప్పటి వరకు 17 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడని, ఇటీవల ఉద్యోగాల పేరుతో ఎంపీలు వీహెచ్, దేవేందర్‌గౌడ్, పాల్వాయి గోవర్ధన్రెడ్డిల నుంచి రూ.3.07 లక్షలు సేకరించాడని క్రైమ్స్ డీసీపీ జి.పాలరాజు వెల్లడించారు.
బీటెక్ చదివి... ఏసీబీకి చిక్కి: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన తోట బాలాజీనాయుడు బీటెక్ పూర్తి చేశాడు. 2003లో ఎన్టీపీసీలో జూనియర్ ఇంజనీర్‌గా చేరి రామగుండం, పాల్వంచ, విశాఖపట్నంలలో పని చేశాడు. వైజాగ్‌లో ఉండగా 2008లో తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆనంద్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖకు చిక్కడంతో ఉద్యోగం కోల్పోయాడు. జైలు నుంచి బయటకు రాగానే మోసాలతో విజృంభించాడు.
బీఎస్ఎన్ఎల్ నుంచి ఫోన్ నంబర్లు... ఈసారి ముగ్గురు ఎంపీలు!
నిందితుడు బీఎస్ఎన్ఎల్ ఎంక్వైరీ నం.197ను సంప్రదించి పలు నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధుల ఫోన్ నంబర్లు సేకరించాడు. రాజీవ్ యువకిరణాల పేరుతో దాని ప్రాజెక్ట్ డెరైక్టర్‌నంటూ ఎర వేశాడు. ఎంపీలు వి.హనుమంతరావు, దేవేందర్‌గౌడ్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిలను టార్గెట్ చేశాడు. వారి నియోజకవర్గాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించుకోవాలని సూచించాడు. ఒక్కో అభ్యర్థి కోసం దరఖాస్తు రుసుము రూ.500, మెస్ చార్జీల కింద రూ.560 కలిపి రూ.1,060 చొప్పున వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయమని కోరాడు. వీరు డిపాజిట్ చేయగానే డబ్బు డ్రా చేసుకుని స్వాహా చేశాడు. ఎంపీలు హనుమంతరావు రూ.1,09,500, దేవేందర్‌గౌడ్ రూ.66,000, గోవర్థన్‌రెడ్డి రూ.1,32,000 డిపాజిట్ చేశారు. అనంతరం ఫోన్ చేస్తానని చెప్పిన వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో అనుమానంతో వారు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ పి.రాజు నేతృత్వంలో ఏఎస్సై ఎస్.సుదర్శన్, కానిస్టేబుళ్లు సతీష్, సలీమ్‌లతో కూడిన ప్రత్యేక బృందం సాంకేతికంగా దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించి, అరెస్టు చేసింది.