ఈ అధికారి ఏంచేశాడో చూడండి..
రాయపూర్: నీళ్లు లేక ఒకపక్క జనం అల్లాడుతుంటే మరొపక్క ప్రజలసొమ్ముతో గవర్నమెంట్ బంగ్లాలో స్విమ్మింగ్ పూల్ కట్టించుకుని జలకాలాటలు ఆడుతున్నాడో ప్రభుత్వాధికారి. ఈ విషయం పాలకుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా ఫారెస్ట్ అధికారిగా పనిచేస్తున్న రాజేశ్ ఛాందెలె ఈ ఘనకార్యం చేశాడు. నీటి కరువుతో ఒక్కపక్క అల్లాడుతుంటే ప్రభుత్వం తనకు కేటాయించిన బంగ్లాలో ఈత కొలను కట్టించుకున్నాడు.
ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రూ.10 లక్షలతో దీన్ని నిర్మించాడని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై అటవీశాఖ మంత్రి మహేశ్ గడ్కా స్పందించారు. స్విమ్మింగ్ పూల్ కు బదులు నీళ్లు లేక అగచాట్లు పడుతున్న ప్రజలకు చెరువు తవ్వించివుంటే బాగుండేదని అన్నారు. ఈ వ్యవహారంపై సీఎం రమణ్ సింగ్ విచారణకు ఆదేశించారు. రాజేశ్ పై గతంలోనూ వివాదాలున్నాయి. అక్రమ సంపాదన కలిగివున్నందుకు 2014లో అతడి నివాసంపై ఏసీబీ దాడులు జరిగాయి.