పోలీసులపై ఎస్పీ ప్రతాపం: సస్పెన్షన్
ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ సీనియర్ ఎస్పీ రాజేష్ మోదక్ తన సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అనుచితంగా ప్రవర్తించినందుకుగాను ఆయనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం క్రమ శిక్షణ చర్యలు తీసుకుంది. రాజేష్ మోదక్‌ను ఆదివారం సస్పెండ్ చేసింది. తన నివాసం వద్ద విధులు నిర్వహించే ముగ్గురు పోలీసు సిబ్బందిని ఆయన కొట్టినట్టు కేసు నమోదైంది.
ఎస్పీ అకారణంగా తమపై చేయి చేసుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విచారించిన అనంతరం పోలీసు శాఖ ఉన్నతాధికారులు రాజేష్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయాన్ని హోం శాఖ వర్గాలు ధ్రువీకరించాయి.